Maharashtra Politics: మహారాష్ట్రలో మరాఠా రిజర్వేషన్ ఉద్యమం హింసాత్మక రూపం దాల్చింది. రాష్ట్రంలోని బీడ్‌లో మరాఠా రిజర్వేషన్ ఆందోళనకారులు ఎన్సీపీ (నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ) ఎమ్మెల్యే ప్రకాశ్ సోలంకే ఇంటిని ధ్వంసం చేసి నిప్పంటించారు. అయితే ఆ సమయంలో ఎమ్మెల్యే ఇంట్లోనే ఉన్నట్లు స్వయంగా ఆయనే చెప్పుకొచ్చారు. దాడి జరిగిన అనంతరం ఈ విషయాన్ని ఆయన స్పష్టం చేశారు. అదృష్టవశాత్తూ ఇంటి నుంచి తాను తప్పించుకున్నానని, ఆందోళనకారుల దాడిలో తన కుటుంబ సభ్యులు, ఉద్యోగులు ఎవరూ గాయపడలేదని ఎమ్మెల్యే ప్రకాశ్ సోలంకే తెలిపారు.
అగ్నిప్రమాదం కారణంగా భారీ ఆస్తి నష్టం వాటిల్లిందని ఎమ్మెల్యే ప్రకాశ్ సోలంకే తెలిపారు. ఎన్‌సీపీ ఎమ్మెల్యే ప్రకాష్ సోలంకే నివాసంపై మరాఠా రిజర్వేషన్ అనుకూల నిరసనకారులు దాడి చేయడంపై సీఎం ఏక్‌నాథ్ షిండే మాట్లాడుతూ.. ఈ నిరసన ఏ మలుపు తిరుగుతుందో మనోజ్ జరంగే పాటిల్ (మరాఠా మోర్చా కన్వీనర్) దృష్టి పెట్టాలని అన్నారు. ఇది తప్పుడు మార్గంలో సాగుతోందని, మరాఠా రిజర్వేషన్ల నిరసనకారుడు మనోజ్ జరాంగే ఆరోగ్యంపై ప్రభుత్వం ఆందోళన చెందుతోందని, ఆయనకు ప్రభుత్వం సమయం ఇవ్వాలని సీఎం ఏక్‌నాథ్ షిండే అన్నారు.
ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే హామీ
మరాఠా వర్గానికి శాశ్వత రిజర్వేషన్లు కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే హామీ ఇచ్చారు. మరాఠాల భూమి అయిన మహారాష్ట్రలో ఈ రోజుల్లో మరాఠా రిజర్వేషన్ల అంశం రగులుతోంది. ఉద్యోగాలు, విద్యలో వెనుకబడిన కులాలకు అందే విధంగానే తమకు కూడా రిజర్వేషన్లు కల్పించాలని మరాఠా కమ్యూనిటీ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. తాజాగా మరాఠా మోర్చా కన్వీనర్ మనోజ్ జరాంగే పాటిల్ నేతృత్వంలో మరాఠా రిజర్వేషన్లు డిమాండ్ చేస్తూ ఉద్యమం కొనసాగుతోంది.