West Bengal Politics : మమతాకు మరో షాక్.. జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా ఎన్‌సీపీఐ.. అసలు ఎన్‌సీపీఐ ఎవరిది? టీడీపీని బీట్ చేయబోతుందా?
West Bengal Politics : త్రిపురకు చెందిన పెద్దగా ప్రాచుర్యం లేని ప్రాంతీయ పార్టీ నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా (NCPI) ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కారణం.. తృణమూల్ కాంగ్రెస్‌లోని అసమ్మతి ఎంపీలు ఈ పార్టీలో విలీనం అయినట్లు ప్రకటించడం.
- Harish Thanniru
- Updated on- June 15, 2026 / 09:53 AM IST
West Bengal Politics
West Bengal Politics : పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో భారీ ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధినేత్రి మమతా బెనర్జీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. తృణమూల్ పార్టీకి చెందిన 20మంది ఎంపీలు నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎన్‌సీపీఐ)లో విలీనమవుతున్నట్లు ప్రకటించారు. అంతేకాదు.. నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతు ఇస్తామని వెల్లడించారు. ఈ పరిణామాలు పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో సంచలనం సృష్టించగా.. జాతీయ రాజకీయాల్లో ఎన్‌సీపీఐ హాట్ టాఫిక్‌గా మారింది. ఈ క్రమంలో అసలు ఎన్‌సీపీఐ పార్టీ ఎవరిది? ఏ రాష్ట్రంలో ఆ పార్టీ రిజిస్ట్రర్ అయింది..? అనే చర్చ విస్తృతంగా కొనసాగుతోంది.
త్రిపురకు చెందిన పెద్దగా ప్రాచుర్యం లేని ప్రాంతీయ పార్టీ నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా (NCPI) ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కారణం.. తృణమూల్ కాంగ్రెస్‌లోని అసమ్మతి ఎంపీలు ఈ పార్టీలో విలీనం అయినట్లు ప్రకటించడం. ఎన్‌సీపీఐ బెంగాల్‌తో ఉన్న సంబంధం కేవలం హౌరా జిల్లాలోని సంక్రైల్ చిరునామా మాత్రమే. 2023లో స్థాపించబడిన ఈ పార్టీ ప్రధానంగా త్రిపుర, మేఘాలయ రాష్ట్రాల్లో పరిమిత స్థాయిలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. పార్టీ ఎన్నికల గుర్తు “ఏడు కిరణాలతో కూడిన పెన్ నిబ్” (కలం మొన). త్రిపురలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ముగ్గురు అభ్యర్థులను బరిలోకి దింపినా ఒక్కరూ గెలవలేదు. అక్కడ పార్టీ వ్యవహారాలను శాంతను సాహా నిర్వహిస్తున్నారు.
ఎన్నికల సంఘం రికార్డుల ప్రకారం చూస్తే.. ఎన్సీపీఐ 2023 జనవరి 20న త్రిపురలో రిజిస్ట్రర్ అన్‌రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీగా నమోదైంది. అక్కడి గిరిజన ప్రాంతాల అభివృద్ధి, వెనుకబడిన వర్గాల ప్రాతినిధ్యం లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చినట్లు పార్టీ వ్యవస్థాపక నాయకుల్లో ఒకరైన శాంతను డే తెలిపారు. అయితే, పార్టీ ప్రధాన కేంద్రం మాత్రం పశ్చిమ బెంగాల్ ఉంది. త్రిపురలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్సీపీఐ తరపున ఏడు స్థానాల్లో అభ్యర్థులు పోటీ చేశారు. కానీ, ఎక్కడ వారి ప్రభావం కనిపించలేదు. దీంతో ఆ ఎన్నికల తరువాత పార్టీ పూర్తిగా కనుమరుగైంది. ప్రస్తుతం మళ్లీ ఎన్సీపీఐ దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
చిన్న ప్రాంతీయ పార్టీ అయిన NCPI ఒక్కసారిగా జాతీయ రాజకీయాల్లో ప్రాధాన్యం పొందడం ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ఆసక్తికర పరిణామంగా మారింది. తృణమూల్ నుంచి బయటకు వచ్చిన ఎంపీలు 20 మంది ప్రస్తుతం ఎన్సీపీలో చేరడంతోపాటు.. ఎన్డీయేకు బయట నుంచి మద్దతు తెలుపుతామని ప్రకటించారు. దీంతో ఇప్పుడు 20మంది ఎంపీలతో ఎన్డీయేలో అతిపెద్ద భాగస్వామిగా ఎన్సీపీఐ మారే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం ఎన్డీయేలో టీడీపీకి 16మంది, జేడీ(యూ)కి 12మంది ఎంపీలు ఉన్నారు. దీంతో టీడీపీ ఎన్డీయే భాగస్వామి పార్టీలో అతి పెద్ద పార్టీగా కొనసాగుతోంది. ఎన్సీపీఐ నుంచి 20 మంది ఎంపీలు ఎన్డీయే భాగస్వామిగా చేరితే టీడీపీని బీట్ చేసి ఎన్డీయేలో అతిపెద్ద భాగస్వామి పార్టీగా ఎన్సీపీఐ అవతరించే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు ప్రస్తుతానికి ఎన్సీపీఐలో చేరుతున్నట్లు ప్రకటించినప్పటికీ.. తృణమూల్‌ను హస్తగతం చేసుకునే ప్రయత్నాలను కొసాగిస్తూనే ఉన్నారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసిన తర్వాత సీనియర్ తృణమూల్ ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ మాట్లాడుతూ.. NCPI ఒక గుర్తింపు పొందిన ప్రాంతీయ పార్టీ. మేము అందులో విలీనమయ్యాము. జూలైలో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైనప్పుడు, అవతలి వర్గం తృణమూల్ కాంగ్రెస్‌గా వస్తుంది; అప్పుడు మాకు మూడింట రెండు వంతుల మెజారిటీ ఉన్నందున తృణమూల్ గుర్తింపును మాకే ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తాము. అప్పుడు కోర్టు నిర్ణయిస్తుంది. నా అనుభవం ప్రకారం, ఈ పరిణామాలన్నీ జరుగుతున్నంత కాలం తృణమూల్ పార్టీ గుర్తు స్తంభింపజేయబడే (ఫ్రీజ్ అయ్యే) అవకాశం ఉందని పేర్కొన్నాడు.
