Vande Bharat Sleeper Train : వందే భారత్ స్లీపర్‌లో లగ్జరీ జర్నీ.. 24 కోచ్‌లతో కొత్త రైలు.. వేడినీటి షవర్, బెర్త్‌పైనే వేడి భోజనం!
Vande Bharat Sleeper Train : 24 కోచ్‌ల వందే భారత్ స్లీపర్ రైలులో ఫ్లైట్ తరహా టాయిలెట్లు, వేడినీటి షవర్, ప్యాంట్రీ కార్, వేడి భోజనం, ఆటోమేటిక్ డోర్లు వంటి సౌకర్యాలు ఉండనున్నాయి. 2027 జూన్ నాటికి అందుబాటులోకి రానుంది. పూర్తి వివరాలివే..
- Sreehari A
- Published on- October 12, 2026 / 05:18 PM IST
Vande Bharat Sleeper Train
- వందే భారత్ స్లీపర్‌లో విలసవంతమైన ప్రయాణం
- రాత్రి ప్రయాణానికి కొత్త లుక్.. 24 కోచ్‌ల వందే భారత్ స్లీపర్
- వందే భారత్ స్లీపర్‌లో ప్రత్యేక టాయిలెట్లు, హాట్ వాటర్ షవర్
- 2027 జూన్ లక్ష్యంగా వందే భారత్ స్లీపర్..
- బెర్త్ నుంచి బాత్‌రూమ్ వరకు అదిరిపోయే ఫీచర్లు..
Vande Bharat Sleeper Train : రాత్రి ప్రయాణాన్ని పూర్తిగా విలాసవంతంగా, సౌకర్యవంతంగా మార్చేందుకు భారతీయ రైల్వే సన్నాహాలు చేస్తోంది. భారతీయ రైల్వేలో రాత్రి, సుదూర ప్రయాణాలను మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు 24 కోచ్‌లతో వందే భారత్ స్లీపర్ రైలుసెట్‌ను రూపొందిస్తున్నారు.
చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF) ఈ రైళ్ల తయారీ బాధ్యతను చేపట్టింది. 2027 జూన్ నాటికి తొలి రైలును అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. మొత్తం 50 రైలుసెట్ల తయారీకి ప్లాన్ రూపొందించారు. కొత్త రైలుసెట్ డిజైన్‌ను వచ్చే నెలలో ఖరారు చేయనున్నట్లు సమాచారం..
ఫ్లైట్ తరహా టాయిలెట్లు.. ఫస్ట్ క్లాస్‌లో హాట్ వాటర్ షవర్ :
ఈ రైలులో విమానాల్లో కనిపించే తరహా బయో-వ్యాక్యూమ్ టాయిలెట్లను ఏర్పాటు చేయనున్నారు. ఏసీ ఫస్ట్ క్లాస్ ప్రయాణికులకు వేడినీటి షవర్ సౌకర్యం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. దివ్యాంగుల అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక టాయిలెట్లు, చిన్నపిల్లల సంరక్షణ కోసం బేబీ కేర్ స్టేషన్‌ను కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రయాణికుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని టాయిలెట్ల సంఖ్యను సైతం పెంచనున్నారు.
రైలులోనే వేడి భోజనం.. ప్రత్యేక ప్యాంట్రీ కార్ :
ఈ 24 కోచ్‌ల మోడల్‌లో ఇంటర్నల్ ప్యాంట్రీ కార్‌ను ఏర్పాటు చేయడం మరో విశేషం. తద్వారా ప్రయాణికులకు రైలులోనే వేడివేడి ఆహారాన్ని అందించే అవకాశం ఉంటుంది. ఐసీఎఫ్ వివరాల ప్రకారం.. ఇతర వందే భారత్ స్లీపర్ మోడళ్లలో ఈ సదుపాయం ఉండదని సమాచారం.
యూరోపియన్ తరహా బెర్త్‌లు.. ఆటోమేటిక్ డోర్లు :
ప్రయాణికులకు మెరుగైన విశ్రాంతి అందించేలా మెత్తని కుషన్లతో బెర్త్‌లను రూపొందిస్తున్నారు. పైబెర్త్‌లపైకి ఈజీగా చేరేందుకు మెట్లు ఉంటాయి. కోచ్‌ల మధ్య ఆటోమేటిక్ డోర్లు పూర్తిగా క్లోజ్ చేసిన లింక్ మార్గాలు ఉండనున్నాయి. డస్ట్, సౌండ్ ప్రభావాన్ని తగ్గించడంలో సాయపడతాయి.
ప్రతి బెర్త్ వద్ద రీడింగ్ లైట్, ఛార్జింగ్ పాయింట్, మడతపెట్టే టేబుల్ వంటి సౌకర్యాలు కల్పించనున్నారు. మొత్తంగా, అడ్వాన్స్ సౌకర్యాలు, మెరుగైన ప్రయాణ అనుభవంతో కొత్త వందే భారత్ స్లీపర్ రైలు భారతీయ రైల్వేలో రాత్రి ప్రయాణాలకు కొత్త రూపాన్ని తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది.
