Nishant Tripathi
Wife harassment: భార్యల వేధింపులు భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న భర్తల సంఖ్య ఇటీవలి కాలంలో పెరుగుతోంది. తాజాగా ముంబైలో ఓ వ్యక్తి హోటల్ గదిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయే ముందు తాను పనిచేసే కంపెనీ వెబ్ సైట్ లో సూసైడ్ నోట్ ను అప్ లోడ్ చేశాడు. అందులో తన చావుకు కారణాలేమిటి అనే విషయాలను తెలిపాడు.
ముంబైలో యానిమేటర్ గా పనిచేస్తున్న నిశాంత్ త్రిపాఠి(41) గత శనివారం ముంబైలో సహారా హోటల్ రూంలో బలవన్మరణానికి పాల్పడ్డాడు. హోటల్ రూం బుక్ చేసి మూడు రోజులవుతున్నా ఎప్పుడు వెళ్లినా ‘డూ నాట్ డిస్ట్రబ్’ అనే బోర్డు తగిలించే ఉంది. హోటల్ సిబ్బంది పలుసార్లు పిలిచినా స్పందనరాలేదు. దీంతో హోటల్ యాజమాన్యం మాస్టర్ కీ సాయంతో త్రిపాఠి రూంను తెరిచి చూడగా ఉరికి వేలాడుతూ కనిపించాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడి తల్లి, మహిళా హక్కుల కార్యకర్త నీలం చతుర్వేది ఫిర్యాదుతో బాధితుడి భార్య అపూర్వ పరేఖ్, అత్త ప్రార్ధనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
త్రిపాఠి చనిపోయే ముందు కంపెనీ వెబ్ సైట్ లో సూసైడ్ నోట్ ను అప్ లోడ్ చేశాడు. ఆ లేఖలో.. ‘‘ఓయ్ నిన్నే.. నీపై నాకు ప్రేమ అనంతం. నేను నీకు ప్రామీస్ చేస్తున్నా అది ఎప్పటికీ చెరిగిపోదు అంటూ.. భార్యను ఉద్దేశిస్తూ రాశాడు. అలాగే.. నా చావుకు నువ్వు, మీ అమ్మ కారణం. ఆ విషయం నా తల్లికి తెలుసు. కాబట్టి మీరు ఆమెను ఇబ్బంది పెట్టొద్దు. ఆమెను ప్రశాంతంగా దు:ఖించనివ్వండి అంటూ లేఖలో త్రిపాఠి పేర్కొన్నాడు.
కొడుకు మరణంతో బతికున్న శవంలా మారా అంటూ నిశాంత్ తల్లి నీలం చతుర్వేది ఆవేదన వ్యక్తంచేస్తూ ఫేస్ బుక్ లో సుదీర్ఘమైన పోస్టు పెట్టారు. ఈ రోజు నేను జీవశ్చవంలా మారాను. నా కొడుకుతో పాటే నా జీవితం ముగిసింది. ఈ విషాద సమయంలో నాకు, నా కూతురుకు ధైర్యాన్ని కల్పించండి అంటూ కోరారు.