Nitish Kumar: నిజాయితీ, నిరాడంబరతకు అప్పుడు నితీశ్ మారుపేరు.. ఇప్పుడు ఎందుకు మారిపోయారో తెలుసా?

రాజకీయచాణక్యం, ముఖ్యమంత్రిగా పనితీరు…నితీశ్‌ను నిరంతర సీఎంగా, నేనేరాజు-నేనేమంత్రి తరహాగా మార్చివేశాయని చెప్పుకోక తప్పదు.

CM Nitish Kumar

కూటమిలో పార్టీలు మారుతుంటాయి. కానీ ముఖ్యమంత్రి మారరు. సీట్లు తక్కువ వచ్చినా….మద్దతిచ్చే పార్టీలు ఎన్ని మారినా ముఖ్యమంత్రి మాత్రం ఆయనే. సీఎం పదవిని ఆయన నుంచి లాగేసుకునే ప్రయత్నమూ మద్దతిచ్చే ఏ పార్టీ చేయదు. అసలు కొత్త పొత్తు కోసం సీఎం పదవి వదులుకోవాలన్న షరతే ఎవరూ విధించరు.

సీఎం అంటే ఆయనే..ఆయనంటే సీఎం. నేనే రాజు-నేనే మంత్రి అన్న సినిమా టైటిల్…అచ్చంగా సూటయ్యే ఆ నేతే తొమ్మిదోసారి బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నితీశ్‌కుమార్. అసలు నితీశ్ ఇంత బలమైన నేతగా ఎలా ఎదిగారు..?

సరిగ్గా మొన్నటివరకు బీజేపీకి వ్యతిరేకంగా…ప్రతిపక్షాలను ఐక్యతగా ఉంచేందుకు పనిచేసిన నితీశ్‌ కుమార్…ఇప్పుడు అదే బీజేపీ మద్దతుతో తొమ్మిదోసారి బీహార్ సీఎంగా ప్రమాణం చేశారు. పల్టీ రామ్‌గా బీహార్ రాజకీయాల్లో గుర్తింపు పొందిన నితీశ్‌కుమార్…ఇన్నిసార్లు NDA నుంచి మహాకూటమికి…ఆ కూటమి నుంచి మళ్లీ NDAకు జంపింగ్ చేయడానికి కారణమేంటి…అంటే వచ్చే సమాధానం బీహార్ సీఎం పదవిలో కొనసాగడం.

సీఎం పదవిని నిలబెట్టుకోవడమే లక్ష్యంగా నితీశ్ రాజకీయాలు సాగుతున్నాయి. ఎవరు మద్దతిస్తారు…ఎవరు వైదొలుగుతారు….ఏ పార్టీ సిద్ధాంతమేంటి..? ఏది భావసారూప్యం ఉన్న పార్టీ…ఇలాంటి ఆలోచనలన్నింటికీ నితీశ్ దూరం. తనను బీహార్ ముఖ్యమంత్రి పీఠంపై కొనసాగించే పార్టీలేమిటి…వ్యక్తులెవరు..పరిస్థితులేంటి..? ఇదొక్కటే నితీశ్ ఆలోచన. తిమ్మిని బమ్మిని చేసైనా సరే..సీఎం పదవి నిలబెట్టుకోవాలి..ఇదే నితీశ్ అంతిమలక్ష్యం.

అప్పట్లో అందరి మన్ననలు..

బీహార్ ముఖ్యమంత్రిగా 2005లో రెండోసారి బాధ్యతలు చేపట్టారు నితీశ్‌కుమార్. అప్పుడు ఆయన్ను చూసే ప్రజలు జేడీయూ-బీజేపీ కూటమికి పట్టం కట్టారు. నిజాయితీ, సచ్ఛీలత, నిరాడంబరతకు అప్పుడు నితీశ్ మారుపేరు. లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుటుంబం, ఆయన పార్టీ నేతల అవినీతి, అరాచకాలు, ఆగడాలతో విసిగిపోయిన బీహార్ ప్రజానీకం…నితీశ్‌లో ఓ గొప్ప రాజకీయనేతను, భవిష్యత్తుపై నమ్మకాన్ని చూసింది.

అందుకే 2005, 2010లో వరుసగా రెండుసార్లు బీహార్ ప్రజలు జేడీయూను గెలిపించారు. నితీశ్ కూడా 2005-2010 మధ్య బీహార్ స్థితిగతులు మార్చడం ద్వారా, అభివృద్ధి రాజకీయాల ద్వారా ప్రజల నమ్మకం నిలబెట్టుకున్నారు. కానీ 2010లో రెండోసారి గెల్చిన మూడేళ్ల తర్వాత నితీశ్ కప్పదాటు రాజకీయాలు మొదలయ్యాయి.

NDAకు దూరం జరగడం, 2014లో సీఎం పదవికి రాజీనామా చేయడం, తర్వాత కూటమి మార్చి మళ్లీ సీఎం పదవి చేపట్టడం, చిరకాల ప్రత్యర్థి లాలూ పార్టీతో కలిసి ఎన్నికల్లో పోటీచేయడం, గెలుపొందడం, 2017లో మళ్లీ కూటమి మార్చి ..NDAలో చేరడం వంటివన్నీ నితీశ్‌ను పల్టీరామ్‌గా మార్చేశాయి.

మధ్యలో ఒక్క ఏడాది మినహా 20 ఏళ్లుగా అధికారంలో కొనసాగుతున్నప్పటికీ…2020 నాటికి నితీశ్‌కుమార్, ఆయన పార్టీ జేడీయూ ఓ రకంగా బీహార్ ప్రజల నమ్మకాన్ని కోల్పోయారు అనే చెప్పాలి. ఆ ఎన్నికల్లో జేడీయూ కన్నా ఆర్జేడీ, బీజేపీకి ఎక్కువసీట్లు వచ్చాయి. కానీ బీజేపీ-జేడీయూ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశాయి.

సహజంగా ఎక్కువసీట్లున్న పార్టీ సీఎంపదవి స్వీకరిస్తుంది. తక్కువ సీట్లున్న పార్టీ…ఉపముఖ్యమంత్రి వంటి పదవులు తీసుకుంటుంది. కానీ విచిత్రంగా బీజేపీ నితీశ్‌కుమార్‌కే సీఎం కుర్చీ అప్పగించింది. దీనికి కారణం ఒకవేళ తాము మద్దతివ్వకపోతే…నితీశ్, ఆర్జేడీ, కాంగ్రెస్ సహకారంతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తాయన్న ఆలోచన. 2015లోనూ ఆర్జేడీ, కాంగ్రెస్…నితీశ్‌కే సీఎం పదవి వదిలేశాయి. అలా తక్కువ స్థానాల్లో గెలిచినప్పటికీ నితీశే బీహార్ సీఎం పీఠంపై ఆసీనులయ్యారు.

బీజేపీపై కోపమొచ్చింది అప్పుడే..
సీఎం పదవి అప్పగించినప్పటికీ…2022నాటికి నితీశ్‌కు బీజేపీపై కోపమొచ్చింది. అమిత్ షా జోక్యం ఎక్కువయిందని, తన పార్టీకి తక్కువసీట్లు ఉన్నాయని…బీజేపీ మంత్రులు ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారన్న అనుమానమొచ్చింది. దీంతో ఆయనే స్వయంగా కాంగ్రెస్‌, ఆర్జేడీలకు పొత్తు ప్రతిపాదన చేశారు.

నిజానికి వారంతట వారే ప్రయత్నించినప్పుడు సీఎం పదవి కోసం పట్టుబట్టే పరిస్థితి ఉండదు. కానీ నితీశ్‌కుమార్ అలా కాదు. ఆర్జేడీ కన్నా తక్కువస్థానాలున్నప్పటికీ..నితీశ్ సీఎం కుర్చీలో తానే కూర్చోవాలనుకున్నారు. ఆర్జేడీ కూడా నితీశ్ డిమాండ్‌కు తలొంచక తప్పలేదు. సోనియాగాంధీకి స్వయంగా ఫోన్ చేసి మద్దతు పొందారు నితీశ్. అలా 2022లో ఎనిమిదోసారి బీహార్ ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు.

ఇక ఇప్పుడు మరోసారి సీఎం పదవి డ్రామాను రక్తికట్టించారు నితీశ్. ప్రతిపక్షాలు బీజేపీకి ఐక్యంగా పోరాడాలని నిన్నమొన్నటిదాకా చెప్పిన నితీశ్…ఇప్పుడు అదే బీజేపీ మద్దతుతో మళ్లీ సీఎం అయ్యారు. విచిత్రంగా NDA కూటమికి దూరం జరగానికి చెప్పిన కారణాలనే ఇప్పుడూ చెబుతున్నారు. RJD మంత్రులు మాట వినడం లేదని అంటున్నారు.

కొత్త బంధం కోసం గతంలో కూటమి వదిలేశానని..కానీ పరిస్థితులు బాగా లేవని అందుకే రాజీనామా చేశానని చెబుతున్నారు. ఆర్జేడీ, కాంగ్రెస్‌ కూటమితో కలిసి పనిచేయడంలో తాను సమస్యలు ఎదుర్కొన్నానని.. ఈ విషయాన్ని పార్టీ సభ్యులకు చెప్పినప్పుడు…వారు రాజీనామా చేయాలని సలహా ఇచ్చారని చెప్పుకొచ్చారు. మొత్తంగా పదేళ్లలో ఐదుసార్లు, రెండేళ్లలో రెండుసార్లు నితీశ్ కూటముల మధ్య జంపింగ్ చేశారు.

పల్టీ రామ్ అయిపోయారు..

ఒకప్పుడు సచ్ఛీలుడైన నేతగా ఉండే నితీశ్.. ఈ జంపింగ్‌ల వల్ల పల్టీ రామ్ అయిపోయారు. అయితే ఎన్నిసార్లు కూటములు, వైఖరులు మార్చుకున్నా…నితీశ్‌ సీఎం పదవిని వదులుకునే పరిస్థితులు ఏర్పడడానికి కారణం…అలాంటి పరిస్థితులు వచ్చాయన్న సంకేతాలు వచ్చినప్పుడల్లా తెలివిగా కూటమి మార్చడం ఒకటయితే…20 ఏళ్ల కాలంలో బీహార్‌ను ఆయన అభివృద్ధి చేసిన తీరు మరోకారణం.

నితీశ్ రాజకీయ అడుగులపై అందరికీ విమర్శలు ఉన్నప్పటికీ..బీహార్‌ ముఖచిత్రం మార్చిన నేతగా ఆయన చేసిన కృషిని ఎవరూ కాదనలేరు. రాజకీయచాణక్యం, ముఖ్యమంత్రిగా పనితీరు…నితీశ్‌ను నిరంతర సీఎంగా, నేనేరాజు-నేనేమంత్రి తరహాగా మార్చివేశాయని చెప్పుకోక తప్పదు.

JDU INDIA Alliance : ఇండియా కూటమితో జేడీయూ ఎందుకు తప్పుకుందంటే? అసలు కారణం ఇదేనంటున్న పార్టీ సీనియర్ నేత

ట్రెండింగ్ వార్తలు