మాంసాహారం లేదా గుడ్లు తీసుకోవడం వల్ల కరోనా వైరస్ వ్యాపించదని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా చెప్పారు.
కరోనా ప్రపంచాన్ని వణికిస్తోంది. భారత్ లో కూడా కరోనా కలకలం రేపుతోంది. కరోనా వ్యాప్తిపై రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. అందులో ప్రధానంగా మాంసం తింటే కరోనా వైరస్ వ్యాపిస్తుందని విస్తృత ప్రచారంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో మాంసాహారం లేదా గుడ్లు తీసుకోవడం వల్ల కరోనా వైరస్ వ్యాపించదని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా చెప్పారు.
సాధారణ ఆరోగ్య సంరక్షణకు ముందు జాగ్రత్తగా, అన్ని రకాల మాంసాలను బాగా కడిగి, సరిగ్గా ఉడికించాలని చెప్పారు. ఉష్ణోగ్రతలు పెరగడంతో వైరస్ తీవ్రత తగ్గుతుందని, చివరికి అదృశ్యమవుతాయనే వాదనలను డాక్టర్ గులేరియా తోసిపుచ్చారు. యూరోపియన్ దేశాల శీతల వాతావరణంలో, వేడి-తేమ వాతావరణ పరిస్థితులలో ఉన్న సింగపూర్ పై కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా ఉందని చెప్పారు.
లవంగం, ఇతర మూలికలు కరోనా వైరస్ వ్యాప్తిని అరికడుతాయని కచ్చితంగా చెప్పలేమని చెప్పారు. మద్యపానం వల్ల కరోనా వైరస్ వ్యాప్తి చెందదని చెప్పాడు. కరోనా వ్యాప్తికి నివారణకు తరచుగా సబ్బుతో చేతులు బాగా కడగాలని ప్రజలకు సూచించారు. సబ్బు లేకపోతే శానిటైజర్లను ఉపయోగించవచ్చన్నారు.