అడ్రస్ అడిగితే గొలుసు లాగేశాడు.. దొంగతో పోరాడిన వృద్ధురాలు

హైదరాబాద్‌లో ఆ మధ్య కొన్ని ప్రాంతాలను టార్గెట్ చేసి చైన్ స్నాచింగ్‌లకు పాల్పడగా వారిని గంటల వ్యవధిలోనే పోలీసులు పట్టుకుని తగిన బుద్ధి చెప్పారు. అలాంటిదే కేరళలోని తిరువనంతపురంలో చోటు చేసుకుంది. పోలీసు తెలిపిన వివరాల ప్రకారం.. కైరల్ గార్డెన్ కాలనీకి చెందిన పార్వతీ దారిన స్కూటర్ మీద వెళ్తున్న వ్యక్తిని ఆపి అడ్రస్ అడిగింది. అతను ఆమెతో మాట్లాడుతూనే అటు చూడు అంటూ.. ఇటు వైపు మెడలో గొలుసు లాగేశాడు. 

వయస్సు మీద పడ్డా.. ప్రాణాలకు లెక్క చేయకుండా వెళ్లిపోతున్న స్కూటర్ వెంటపడింది ఆ వృద్ధురాలు. చీర కాళ్లకు అడ్డుపడి కిందపడి మళ్లీ లేచి మరోసారి కిందపడి మళ్లీ లేచి వెళ్లి దగ్గరలో ఉన్న పోలీసు కానిస్టేబుల్‌కు జరిగిన విషయాన్ని చెప్పింది. కంట్రోల్ రూంకు సమాచారమివ్వడంతో సీసీ కెమెరాల సహాయంతో బైక్ నంబర్ ఆధారంగా దొంగను పట్టుకోగలిగారు. 

 

సజీవ్ అనే ఈ వ్యక్తి పలుమార్లు చైన్ స్నాచింగ్‌లకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.  మ్యూజియం జంక్షన్‌లో కనకక్కున్ను ప్యాలెస్‌కు దగ్గరలో ఘటన జరగడంతో ముందుగా స్పందించిన మ్యూజియం పోలీసులు కేసును పూజాపుర పోలీస్ స్టేషన్‌కు ఫార్వార్డ్ చేశారు.