ఏం తీసుకొచ్చింది : పంజాబ్‌లో దొరికిన పాక్ డ్రోన్

ఆయుధాలు సరఫరా చేసే క్రమంలో వచ్చిన పాకిస్తాన్‌కు చెందిన మరో డ్రోన్ భారత్‌లోని పంజాబ్‌లో చిక్కుకుపోయింది. పాకిస్తాన్ బోర్డర్ కు చేరువగా ఉన్న పంజాబ్‌లోని అట్టారీ ప్రాంతంలో దొరికినట్లు ఆనవాళ్లు గుర్తించారు భారత పోలీసులు. ఉగ్రదాడి పొంచి ఉందనే కోణంలో విచారణ చేపట్టిన అధికారులకు డ్రోన్ జాడలు తెలిశాయి. 

‘ఈ డ్రోన్ పాకిస్తాన్ తిరిగి వెళ్లలేకపోయింది. దీంతో నిందితుడు దీనిని అట్టారీ సరిహద్దులోనే దాచి పెట్టేందుకు యత్నించాడు. ఈ క్రమంలోనే పొలంలో కప్పెట్టేశాడు. డ్రోన్ పడిన తర్వాత దాని వెంటే పరిగెత్తడం గమనించిన పోలీసులు డ్రోన్ జాడను కనిపెట్టగలిగారు’ అని సీనియర్ అధికారి బల్బీర్ సింగ్ తెలిపారు.

గత వారం పంజాబ్ పోలీసులు తమ ప్రాంతంలో పాకిస్తాన్‌కు చెందిన డ్రోన్ పడిందని అవి ఏకే 47, గ్రెనేడ్లను అమృత్‌సర్‌లోని ప్రాంతాలకు చేరవేస్తున్నట్లు తెలిపారు. జమ్మూ కశ్మీర్ ప్రజల్లో సమస్యలు సృష్టించాలని వారు ఇలా చేస్తున్నారని ఆరోపించారు. కొద్ది రోజులుగా ఉగ్రజాడలు కనిపిస్తున్నాయని, పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. 

5కేజీల బరువు వరకూ డ్రోన్లు మోసుకెళ్లగలవు. ఇదే క్రమంలో ఆయుధాలను, శాటిలైట్ ఫోన్లను భారత భూభాగంలోకి తీసుకువచ్చేందుకు యత్నిస్తున్నారు. బీఎస్సెఫ్ జోహ్రీ పంజాబ్‌ను సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. కేంద్ర హోం శాఖకు జరిగిన నష్టం గురించి రిపోర్ట్ ఇవ్వనున్నారు.