పాక్ బుద్ది మారట్లేదు. ఎన్ని దెబ్బలు తగిలినా.. ఎన్ని చివాట్లు తిన్నా.. తీరు మార్చుకోవట్లేదు. కుక్క తోక ఎప్పటికీ వంకరే అన్నట్లుగానే ఉంటోంది. అటు పంజాబ్ సరిహద్దుల్లో డ్రోన్‌లతో వక్రబుద్ది చూపిస్తూనే… ఇటు సరిహద్దులో కాల్పులకు తెగబడుతున్నారు. నిబంధనలు అతిక్రమించి కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. తాజాగా అక్టోబర్ 10వ తేదీ గురువారం పంజాబ్ సరిహద్దుల్లో మరోసారి పాక్ డ్రోన్లు కలకలం రేపాయి.
సెప్టెంబర్ చివర్లో తొలిసారి భారత భూభాగంలోకి ప్రవేశించిన డ్రోన్లు… మరోసారి ఫిరోజ్‌పూర్‌లో మూడురోజుల నుంచి తిరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఆరు పాక్ డ్రోన్లు భారత భూభాగంలో చక్కర్లు కొట్టడాన్ని స్థానిక ప్రజలు సైతం గమనించారు. అయితే మూడు రోజులుగా చక్కర్లు కొడుతున్న డ్రోన్లు… ఫిరోజ్‌పూర్ సరిహద్దుల్లో కూలిపోయి ఉంటాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దాంతో డ్రోన్ శకలాల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు డ్రోన్ల ద్వారా ఉగ్రమూకలకు డ్రగ్స్, మందుగుండు సామగ్రి సరఫరా చేస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఉగ్రవాదులకు సహాయం అందించేందుకు పాక్ పలు ప్రయత్నాలు చేస్తోంది. గడిచినవారం రోజుల్లో డ్రోన్లను భారత భూభాగంలోకి ప్రవేశింప చేశారు. డ్రోన్ల ద్వారా పది కేజీల బరువు ఉండే గన్లు, మందుగుండు సామాగ్రీని ఉగ్రవాదులకు చేరవేస్తున్నారని భద్రతా బలగాలు భావిస్తున్నాయి. మరోవైపు అవింతిపూర, పూంచ్ తదితర ప్రాంతాల్లో పాక్ కాల్పులకు దిగుతోంది. భారత్‌లోకి 60 మంది ఉగ్రవాదులు చొరబడ్డారని నిఘా విభాగం హెచ్చరికలు చేసింది.
Read More : వాళ్లకు ఎమోషన్ లేదు: ఇరవై రెండేళ్ల తర్వాత విడాకులు