People think back seaters do not need belt says Nitin Gadkari after Cyrus Mistry
Nitin Gadkari: టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ మరణం దేశాన్ని కుదిపివేసింది. రోడ్డు ప్రమాదంలో ఆయన మరణించిన విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో మిస్త్రీ సీట్ బెల్టు పెట్టుకోలేదని పోలీసులు దర్యాప్తులో తేలింది. ఈ నేపథ్యంలో కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరి స్పందిస్తూ కొందరు ముఖ్యమంత్రులు కూడా సీటు బెల్ట్ పెట్టుకోవడం లేదని, అందరి సహకారం లేకుండా రోడ్డు ప్రమాదాలను నివారించలేమని అన్నారు. అయితే తాను ఏ రోడ్డు ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్పడం లేదని గడ్కరి పేర్కొనడం గమనార్హం.
‘‘ముందు సీట్లో ఉన్నవారే కాదు. వెనుక సీట్లో ఉన్నవారు కూడా సీట్ బెల్ట్ పెట్టుకోవాల్సిందే. వెనుక సీట్లో ఉంటే సీట్ బెల్ట్ పెట్టుకోవాల్సిన అసవరం లేదని కొందరు అనుకుంటారు. అది సరైన ఆలోచన కాదు. ఈ విషయంలో సామాన్యులను వదిలేయండి. నేను కొంతమంది ముఖ్యమంత్రులతో కారులో ప్రయాణించాను. వారి పేర్లేంటని మాత్రం అడగొద్దు. ఆ సమయంలో నేను ముందు సీటులో కూర్చున్నాను. వారు నా వెనుక సీట్లో కూర్చున్నారు. కానీ వారు రోడ్డు భద్రతా నియమాళను పాటించలేదు’’ అని గడ్కరి అన్నారు.
గతంలో ఎన్నడూ లేనంతగా 2021లో రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఆ ఏడాదిలో 1.55 లక్షల మంది రోడ్డు ప్రమాదంలో మృతి చెందారని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఈ లెక్క ప్రకారం.. ప్రతి గంటలకు 18 మంది మరణిస్తున్నారట. ఒక్క రోజులో 426 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక గతేడాది జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 3.71 లక్షల మంది గాయపడ్డట్లు నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో నివేదిక పేర్కొంది.