తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం మంగళవారం (మార్చి 17, 2020) నుంచి దివ్యాంగులు, వయోవృద్దులకు ప్రత్యేక దర్శనం ప్రారంభం కానుంది. వారికోసం తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. తొలిదశలో 65 సంవత్సరాలకు పైబడి వయస్సు ఉన్న వయోధిక వృద్ధులకు స్వామివారి దర్శనాన్ని కల్పించనుంది. దీనికోసం నాలుగువేల టోకెన్లను జారీ చేశారు టీటీడీ అధికారులు.
ఉదయం 10 గంటల సమయంలో వెయ్యి టికెట్లు, మధ్యాహ్నం 2 గంటలకు రెండువేల టోకెన్లను జారీ చేయనుంది. అలాగే 3 గంటలకు మరో వెయ్యి టోకెన్ల జారీ చేయనుంది. రేపటి నుండి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని గదులలో వేచి ఉండేందుకు అవకాశం లేదు. టైమ్ స్లాట్ ప్రకారం భక్తులను టైమ్ కి క్యూలో నేరుగా స్వామిదర్శనానికి అనుమతిస్తారు.
See Also | సీఎం జగన్ తీవ్ర ఆరోపణల తర్వాత గవర్నర్‌ను కలిసిన ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్
అంతేకాదు విదేశాల నుండి వచ్చిన వారు 28 రోజుల వరకు తిరుమల యాత్రకు రావొద్దని అధికారులు సూచించారు. తిరుమలకు వచ్చే భక్తులందరికి శ్రీవారి మెట్టు, టోల్ గేట్ దగ్గర వైద్యపరీక్షలు నిర్వహించి లోపలకు పంపిస్తామని, ఎవరికైనా టెంపరేచర్ ఎక్కువగా ఉంటే లోపలకి అనుమతించమని తెలిపారు.