సాంకేతిక కారణాలతో అనుకున్నది సాధించలేకపోయిన చంద్రయాన్ 2 ప్రయోగంపై ప్రధాని మోడీ జాతిని ఉద్దేశించి మాట్లాడారు. భారత శాస్త్రవేత్తలకు ఆయన ధైర్యం చెప్పారు. నేనున్నా అంటూ భరోసా ఇచ్చారు. ఇది ఓటమి కాదు అన్నారు. శాస్త్రవేత్తల కృషి వమ్ము కాదన్నారు. ఈ అడ్డంకులు మన లక్ష్యాన్ని ఆపలేవు అన్నారు. భవిష్యత్ లో మరిన్ని విజయాలు సాధిస్తామని మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు. బెంగళూరులోని ఇస్రో కేంద్రం నుంచి ప్రధాని మోడీ చంద్రయాన్ 2 ప్రయోగంపై మాట్లాడారు. భారత్ మాతాకీ జై అంటూ ఆయన ప్రసంగం స్టార్ట్ చేశారు.
విజయం కోసం భారత శాస్త్రవేత్తలు తీవ్రంగా శ్రమించారని ప్రధాని ప్రశంసించారు. దేశ ప్రజల కలలను సాకారం చేసేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నించారని చెప్పారు. భరతమాత తలెత్తుకునేలా కృషి చేశారని మోడీ కొనియాడారు. జాతి గర్వించేలా దేశం కోసం శాస్త్రవేత్తలు తమ జీవితాలను ధారపోశారని చెప్పారు. దేశం మొత్తం మీకు సంఘీభావంగా రాత్రంతా మేల్కొని ఉందన్నారు. ఇది వెనుకడుగు మాత్రం కాదన్నారు. శాస్త్రవేత్తల మనోభావాలను అర్థం చేసుకున్నా అని మోడీ అన్నారు. చంద్రయాన్ 2 ప్రయోగం చేసిన శాస్త్రవేత్తలపై ప్రధాని మోడీ ప్రశంసల వర్షం కురిపించారు.
దేశం మొత్తం ఉత్కంఠగా ఎదురుచూసిన చంద్రయాన్-2 ప్రయోగంలో సాంతికేతిక లోపం తలెత్తింది. ఆఖరి క్షణంలో చుక్కెదురైంది. 2.1 కిమీ ఎత్తులో విక్రమ్ ల్యాండర్ నుంచి సిగ్నల్స్ నిలిచిపోయాయి. దీంతో శాస్త్రవేత్తలు తీవ్ర నిరాశ చెందారు.