జాతిపిత మహాత్మా గాంధీ 150వ జయంతి వేడుకలను దేశమంతా ఘనంగా జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ప్రధాని మోడీ రూ.150ల స్మారక నాణేన్ని విడుదల చేశారు. బుధవారం (అక్టోబర్ 2, 2019) గుజరాత్‌లోని సబర్మతి నదీ ఒడ్డున నిర్వహించిన స్వచ్ఛ భారత్ దివస్ కార్యక్రమంలో 150 రూపాయల నాణేన్ని విడుదల చేశారు.
ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ గాంధీ జయంతిని యావత్ ప్రపంచం జరుపుకుంటోందన్నారు. మహాత్ముడి జయంతికి స్మారకంగా ఐక్యరాజ్య సమితి పోస్టల్ స్టాంపులను విడుదల చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఇప్పుడు స్మారక స్టాంపులు, నాణేలను కూడా విడుదలు చేస్తున్నామన్నారు.
అంతకముందు సబర్మతీ ఆశ్రమాన్ని మోడీ సందర్శించారు. గాంధీ జయంతి వేళ ఆ మహాత్ముడికి ఘన నివాళులర్పించారు. సబర్మతి ఆశ్రమంలో గాంధీ వాడిన వస్తువులు, ఆయన నడియాడిన నేలను సందర్శించారు. దేశానికి మహాత్ముడు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారాయన.