రష్యాలోని కజాన్‌లో బ్రిక్స్ సమావేశంలో పాల్గొన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఇందులో భాగంగా ద్వైపాక్షిక సమావేశంలోనూ పాల్గొంటారు. వీరిద్దరు ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొంటుండడం ఐదేళ్లలో ఇదే తొలిసారి. తాజాగా, భారత్-చైనా వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి సరిహద్దుల్లో పెట్రోలింగ్ కార్యకలాపాలను పునఃప్రారంభించేందుకు ఒప్పందానికి వచ్చిన విషయం తెలిసిందే.
ఇరు దేశాల అధినేత మధ్య ద్వైపాక్షిక సమావేశాలు జరిగే ముందు ఈ ఒప్పందం కుదరడం శుభపరిణామమే. 2020లో భారత్, చైనా దళాల మధ్య జరిగిన ఘర్షణల తర్వాత ఇరు దేశాల మధ్య పరిస్థితులు మరింత ప్రతికూలంగా మారాయి. జిన్‌పింగ్ 2019 అక్టోబర్‌లో మహాబలిపురంలో నరేంద్ర మోదీతో చివరిసారిగా సమావేశం అయ్యారు. మళ్లీ వీరిద్దరి మధ్య ద్వైపాక్షిక చర్చలు జరుగుతుండడం ఇదే తొలిసారి.
కొన్నేళ్ల నుంచి ఇరు దేశాల మధ్య చెలరేగిన వివాదాలు
డోక్లామ్ ప్రతిష్టంభన: ఇరు దేశాల మధ్య డోక్లామ్ ప్రతిష్టంభన 2017లో జరిగింది. అనంతరం అది తీవ్ర ఉద్రిక్తతలకు వేదికగా మారింది. భారత్, భూటాన్, చైనాల ట్రై జంక్షన్ సమీపంలోని డోక్లామ్ ప్రాంతంలో ఇండియా, చైనా సైన్యం ఘర్షణకు దిగాయి. ఈ వివాదం 73 రోజుల పాటు కొనసాగింది. వివాదాస్పద భూభాగంలో రహదారిని నిర్మించడానికి చైనా ప్రయత్నాలు చేయడంతో ఆ వివాదం చెలరేగింది.
2019లో ఉద్రిక్తతలు: జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు వేళ 2019లో భారత్, చైనా మధ్య కూడా ఉద్రిక్తతలు మొదలయ్యాయి. చైనా నియంత్రణలో ఉన్న అక్సాయ్ చిన్‌తో సరిహద్దును పంచుకునే లద్దాక్‌కు సంబంధించి చైనా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ విషయంపై చైనా ఐక్యరాజ్యసమితిలో ఆందోళన తెలిపింది. దౌత్య ఘర్షణను పెంచింది.
2020లో గల్వాన్ వ్యాలీ ఘర్షణ: ఇరు దేశాల మధ్య 2020 మేలో ఇరు దేశాల సైనికులు ఘర్షణకు దిగారు. పాంగోంగ్ త్సో, గాల్వాన్ వ్యాలీ, హాట్ స్ప్రింగ్స్ సహా తూర్పు లద్దాక్‌లోని వాస్తవాదీన రేఖ వెంబడి వివిధ పాయింట్ల వద్ద చైనా, భారత సైనికులు ఘర్షణ పడ్డారు. 2020 జూన్ 15న గాల్వాన్ లోయలో ఇరు దేశాల మధ్య అత్యంత ఘోరమైన ఘర్షణ జరిగింది. 20 మంది భారతీయ సైనికులు వీరమరణం పొందారు. చైనా సైనికులు కూడా భారీ సంఖ్యలో చనిపోయారు.
2020-2021 పాంగోంగ్ త్సో ప్రతిష్టంభన: 2020 ఆగస్టులో దక్షిణ ఒడ్డు వెంబడి తమ బలగాలను కొత్త స్థానాల్లోకి తరలించడం ద్వారా పాంగోంగ్ త్సో ప్రాంతంలో యథాతథ స్థితిని మార్చేందుకు చైనా ప్రయత్నించింది. 2021 ఫిబ్రవరిలో ఇరు దేశాలు చర్చించి తమ సైన్యాలను వెనక్కు రప్పించుకున్నాయి.
2021లో డెప్సాంగ్ మైదానాలు, గోగ్రా-హాట్ స్ప్రింగ్స్ వద్ద వివాదం: దేప్సాంగ్ మైదానాలు, గోగ్రా-హాట్ స్ప్రింగ్స్ వంటి ప్రాంతాల్లో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగాయి. ఆయా ప్రాంతాల్లో భారత గస్తీని చైనా దళాలు అడ్డుకోవడం వంటి చర్యలకు పాల్పడ్డాయి. 2021 జూలైలో గోగ్రాలో సైనికులు ఓ ఒప్పందం చేసుకున్నారు.
2022 అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ ఘర్షణ: ఈ వివాదం 2022 డిసెంబర్‌లో చోటుచేసుకుంది. అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్‌లో భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగింది. లద్దాక్‌లోని వాస్తవాదీన రేకకి దూరంగా తూర్పు సెక్టార్‌లో ఘర్షణ చోటుచేసుకుంది.
సైనిక చర్చలు, దౌత్యం: వాస్తవాదీన రేఖతో పాటు ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడానికి భారత్, చైనా 2020 నుంచి అనేక రౌండ్ల సైనిక, దౌత్యపరమైన చర్చలు చేశాయి. ఇవి అంతగా ఫలించలేదు.
మౌలిక సదుపాయాల అభివృద్ధి: భారత్, చైనా వాస్తవాదీన రేఖ వెంట మౌలిక సదుపాయాలను నిర్మించడం కొనసాగించాయి.
ఆ బాలిక కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం ప్రకటించిన సీఎం చంద్రబాబు..