National Unity Day : సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆశయాలు మనలో నడుస్తున్నట్లు అనిపిస్తోంది : ప్రధాని మోదీ

సర్దార్ సాహెబ్ జీవితం, త్యాగం,ఏక భారతదేశాన్ని నిర్మించడంలో ఆయన చేసిన కృషిని సలాములు చేస్తున్నారని అన్నారు. ఈ విగ్రహ నిర్మాణ కథే 'ఏక్ భారత్ - శ్రేష్ఠ భారత్' స్ఫూర్తికి అద్దం పడుతోందన్నారు.

Sardar Vallabhbhai Patel Jayanti ..PM Modi

PM Modi National Unity Day parade in Gujarat : అక్టోబర్ 31, దేశ వ్యాప్తంగా ఐక్యతా దివస్ వేడుకలు జరుగుతున్నాయి. ఉక్కుమనిషిగా పేరొంది..దేశ తొలి హోంమంత్రి సర్దార్‌ వల్లభాయ్ పటేల్ జయంతిని కేంద్ర ప్రభుత్వం ఐక్యతా దివస్ గా జరుపుతోంది. దీంట్లో భాగంగా ఐక్యతా దివస్ సందర్భంగా కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ఢిల్లీలో ఐక్యతా పరుగును ప్రారంభించారు. అలాగే గుజరాత్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్రమోడీ అక్కడి ఏక్తానగర్ లో జరుగుతున్న ఐక్యతా దివస్ వేడుకల్లో పాల్గొన్నారు. నేషనల్ యూనిటీ పరేడ్ లో పాల్గొన్నారు ప్రధాని మోదీ. 148వ జయంతి సందర్భంగా పటేల్ ను స్మరించుకుంటు నర్మదా నది తీరంలోని స్టాట్యూ ఆఫ్ యునిటీ విగ్రహానికి నివాళులు అర్పించారు. పటేల్ విగ్రహ పాదాలకు పాలాభిషేకం చేసి నివాళులు అర్పించారు..

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు..ఏక్తానగర్ కు వచ్చిన ప్రజలు పటేల్ సాబ్ గొప్ప విగ్రహాన్ని చూసి ఆనందభరితులు అవుతున్నారని అన్నారు. ఇక్కడికొచ్చే ప్రజలు కేవలం విగ్రహాన్ని చూడటమే కాదు..సర్దార్ సాహెబ్ జీవితం, త్యాగం,ఏక భారతదేశాన్ని నిర్మించడంలో ఆయన చేసిన కృషిని సలాములు చేస్తున్నారని అన్నారు. ఈ విగ్రహ నిర్మాణ కథే ‘ఏక్ భారత్ – శ్రేష్ఠ భారత్’ స్ఫూర్తికి అద్దం పడుతోందన్నారు.

దేశవ్యాప్తంగా సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా’రన్ ఫర్ యూనిటీ’లో లక్షలాది మంది పాల్గొంటున్నారని తెలిపారు. 140 కోట్ల మంది భారతీయుల మధ్య ఈ ఐక్యత ప్రవాహాన్ని చూస్తుంటే..సర్దార్ సాహెబ్ ఆశయాలు ‘ఏక్ భారత్-శ్రేష్ఠ భారత్’ అనే సంకల్పం రూపంలో మనలో నడుస్తున్నట్లు అనిపిస్తోంది అన్నారు.

ఈ రోజు నా ముందు ఓ మినీ ఇండియా రూపం కనిపిస్తోందన్నారు. రాష్ట్రం వేరు, భాష వేరు, సంప్రదాయం వేరు, కానీ ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తి ఐక్యంగా ఉంటాడు అంటూ వ్యాఖ్యానించారు. అది ఒక బలమైన దారంతో ముడిపడి ఉందని…ఆగస్టు 15న ఎర్రకోటలో జరిగే సంఘటనలు, జనవరి 26న కర్తవ్య మార్గంలో జరిగే కవాతు, నర్మదా తీరంలో జరిగే ఐక్యతా దినోత్సవ వేడుకలు మూడు శక్తులుగా మారాయి అని అన్నారు.

 

కాగా ఈ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ దేశ సమగ్రత పరిరక్షణకు కృషి చేస్తామని అక్కడి అధికారులు, ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. 2014 నుంచి అక్టోబర్‌ 31న కేంద్రప్రభుత్వం జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా నర్మదా తీరంలో ఏక్తా దివస్ వేడుకలలో త్రివిధ దళాల పరేడ్ ఆకట్టుకుంది.

ఈ వేడుకను పురస్కరించుకుని ప్రధాని మోదీ సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ అచంచలమైన స్ఫూర్తిని, దూరదృష్టితో కూడిన రాజనీతిజ్ఞతను, అసాధారణమైన అంకితభావాన్ని మనం గుర్తుంచుకోవాలి. జాతీయ సమగ్రత పట్ల ఆయన నిబద్ధత మనకు మార్గనిర్దేశం చేస్తుంది. పటేల్ సేవకు మేము ఎప్పటికీ రుణపడి ఉంటాము” అని ట్వీట్ పేర్కొన్నారు.