కరోనా కట్టడిలో భాగంగా విధించిన లాక్‌డౌన్, ఎదురువుతున్న ఇబ్బందుల గురించి గ్రామస్థాయిలో తెలుసుకోడానికి ప్రధాని మోడీ రెడీ అయ్యారు. ఇందులో భాగంగా ఇవాళ(ఏప్రిల్-24,2020) ఉదయం 11గంటలకు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లోని సర్పంచ్ లతో ప్రధాని మాట్లాడనున్నారు.దూరదర్శన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోడీ వారితో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా వారి అభిప్రాయాలను ప్రధాని అడిగి తెలుసుకోనున్నారు. కాగా,దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 23,502కి చేరగా,722మరణాలు నమోదయ్యాయి. కాగా,కరోనా ప్రభావం అధికంగా ఉన్న రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచింది. మహారాష్ట్రలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది.
దేశంలోనే అత్యధికంగా కరోనా వైరస్ కేసులు ఆ రాష్ట్రంలోనే నమోదవుతున్నాయి. గురువారం ఒక్క రోజే మరో 778 మంది వైరస్ బారినపడ్డారు. మహారాష్ట్ర ఒక మంత్రి కూడా కరోనా బారిన పడ్డారు. కాగా, భారత దేశంలో కరోనా కట్టడికి మోడీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై అంతర్జాతీయ సమాజం నుంచి ప్రశంసలు వస్తున్న విషయం తెలిసిందే. దేశీయంగా కూడా ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం కొవిడ్-19ను సమర్థంగానే ఎదుర్కొంటోందని ఎక్కువ మంది ప్రజలు అభిప్రాయపడుతున్నట్లు ఓ సర్వేలో తేలింది.