PM Removal Bill
PM Removal Bill : కేంద్ర ప్రభుత్వం దేశ రాజకీయాల్లో కీలకమైన మార్పులకు శ్రీకారం చుడుతూ సరికొత్త బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ కొత్త బిల్లు ఆమోదం పొందితే కేంద్ర మంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, ఏకంగా ప్రధాన మంత్రి అయినా తీవ్రమైన నేరారోపణలతో అరెస్టయి వరుసగా 30రోజులపాటు నిర్బంధంలో ఉంటే పదవి నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. (PM Removal Bill)
కేంద్ర హోంశాఖ ఈ బిల్లును బుధవారం లోక్ సభలో ప్రవేశపెట్టనుంది. ఈ కొత్త చట్టం ప్రకారం.. ఎవరైనా ప్రజాప్రతినిధి ఐదేళ్ల కంటే ఎక్కువ శిక్షపడే అవకాశం ఉన్న నేరంలో ఆరోపణలు ఎదుర్కొంటూ.. 30రోజులపాటు నిర్భందంలో ఉంటే.. 31వ రోజు పదవి నుంచి తప్పుకోవాలి. ఒకవేళ పదవి నుంచి స్వచ్ఛందంగా తప్పుకోకపోయినా కొత్త బిల్లు నిబంధనల ప్రకారం.. పదవి కోల్పోయేలా నిబంధనను ఈ బిల్లులో చేర్చారు.
తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటూ జైళ్లకు వెళ్లినా కొందరు ప్రజాప్రతినిధులు పదవిలో కొనసాగడం వల్ల ప్రజల విశ్వాసం సన్నగిల్లుతుందని, పరిపాలనపై చెడు ప్రభావం చూపుతుందని ప్రభుత్వం భావిస్తోంది. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో కొత్తగా ప్రవేశపెట్టబోయే ఈ బిల్లును పలువురు తప్పుబడుతున్నారు.
మరోవైపు ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులను అరెస్టు చేయించి.. అక్కడి ప్రభుత్వాలను అస్థిరపర్చడానికే కేంద్రం ఈ బిల్లును తీసుకొస్తుందని కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. తప్పుడు ఆరోపణలతో కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రయోగించి ఎలాంటి నేరం రుజువు కాకముందే, కేవలం అరెస్ట్ ఆధారంగా ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ముఖ్యమంత్రిని తొలగించడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని వాదిస్తున్నారు.