Delhi CM Rekha Gupta : ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై దాడి.. ఫిర్యాదు ఇచ్చేందుకు వచ్చి ఫడేల్మని చెంపపై కొట్టాడు.. అతడు చెప్పిన కారణం..
ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా (Delhi CM Rekha Gupta) పై దాడి జరిగింది. తన ఫిర్యాదు అందించేందుకు వచ్చిన ఓ వ్యక్తి ఆమె చెంపపై కొట్టాడు.

Delhi CM Rekha Gupta
Delhi CM Rekha Gupta : ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా (Delhi CM Rekha Gupta) పై దాడి జరిగింది. తన ఫిర్యాదు అందించేందుకు వచ్చిన ఓ వ్యక్తి ఆమె చెంపపై కొట్టాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ సివిల్ లైన్స్ లోని తన నివాసంలో జన్‌సున్‌వాయ్ నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
ముఖ్యమంత్రి నివాస అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రతి బుధవారం ముఖ్యమంత్రి రేఖా గుప్తా జన్‌సున్‌వాయ్ కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. ఈ క్రమంలో ఇవాళ ముఖ్యమంత్రి నివాసంలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తుండగా.. ఓ వ్యక్తి తన ఫిర్యాదుతో అక్కడికి చేరుకున్నాడు. ఫిర్యాదు ఇచ్చే సమయంలో ముఖ్యమంత్రి రేఖాగుప్తాను చెంపదెబ్బ కొట్టాడు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
ఢిల్లీ సీఎంపై దాడికి పాల్పడిన వ్యక్తి వయస్సు 41 సంవత్సరాలుగా ఉంటుందని చెబుతున్నారు. పోలీసులు అతన్ని సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఢిల్లీ బీజేపీ ఈ ఘటనను ఖండించింది. ఢిల్లీ బీజేపీ అధికార ప్రతినిధి ప్రవీణ్ శంకర్ మాట్లాడుతూ.. ప్రజా ఫిర్యాదులు స్వీకరిస్తున్న సమయంలో ఫిర్యాదు ఇచ్చే సాకుతో వచ్చిన వ్యక్తి .. సీఎం గుప్తాకు మొదట తన ఫిర్యాదుకు సంబంధించిన కొన్ని పత్రాలు అందజేశాడు. ఆ తరువాత అరవడం ప్రారంభించి.. ఒక్కసారిగా సీఎం గుప్తా చెంపపై కొట్టాడని అన్నారు.
ఘటన జరిగిన వెంటనే పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. తన కుటుంబానికి చెందిన ఒకరు జైల్లో ఉన్నారని.. వారిని విడిపించేందుకు సాయం చేయాల్సిందిగా అతను సీఎంను కోరడానికి వచ్చినట్టు చెప్పాడు. ఆ క్రమంలోనే సీఎంపై దాడి చేసినట్టు నిందితుడు పోలీసులకు చెప్పాడు.
మరోవైపు.. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై జరిగిన దాడిని ఆమ్ ఆద్మీ పార్టీ ఖండించింది. ఆ పార్టీ నాయకురాలు అతిషి మాట్లాడుతూ.. ఢిల్లీ సీఎంపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలు, నిరసనలకు చోటు ఉంటుంది. కానీ, హింసకు చోటు లేదు. నిందితులపై ఢిల్లీ పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాము అని అన్నారు.
సీఎం రేఖా గుప్తాపై దాడి ఘటనను ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ దేవేంద్ర యాదవ్ ఖండించారు. ఈ ఘటన చాలా దురదృష్టకరమని అన్నారు. ముఖ్యమంత్రి మొత్తం ఢిల్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇలాంటి సంఘటనలను ఖండించాలని నేను భావిస్తున్నాను. కానీ, ఈ సంఘటన మహిళల భద్రత యొక్క వాస్తవాన్ని బయటపెట్టింది. ఢిల్లీ ముఖ్యమంత్రి సురక్షితంగా లేకపోతే, రాజధానిలో ఒక సాధారణ మహిళ ఎలా సురక్షితంగా ఉంటుందని ఆయన ప్రశ్నించారు.
రేఖ గుప్తాపై దాడి చేసిన నిందితుడు ఇతడే ..
ఢిల్లీ సీఎం రేఖ గుప్తాపై దాడి చేసిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అతని పేరు రాజేష్ ఖిమ్జీ గా గుర్తించారు. అతని వయస్సు 41ఏళ్లు. రాజ్‌కోట్ నివాసి. రాజేష్ ఖిమ్జీ బంధువు జైల్లో ఉన్నాడని, అతని కేసు కోర్టులో నడుస్తోందని పోలీసుల దర్యాప్తులో తేలింది. తనను విడుదల చేయాలని కోరుతూ ఆయన సీఎం రేఖ గుప్తాకు దరఖాస్తు తెచ్చారని చెబుతున్నారు. అయితే, ఢిల్లీ పోలీసులు రాజ్ కోట్ పోలీసులతో సంప్రదింపులు జరుపుతున్నారు. పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.
రాజేష్ ఖిమ్జీ తల్లి ఏమందంటే..?
రాజేష్ ఖిమ్జీ తల్లి బాను బెన్ మాట్లాడుతూ.. నా కొడుకు జంతు ప్రేమికుడు. కుక్కల విషయం గురించి బాధపడ్డాడు. అందుకే అతను ఢిల్లీకి వెళ్లాడు. కుక్కను కొట్టకూడదు.. దానికి రొట్టె తినిపించాలి అని నా కొడుకు చెప్పేవాడని ఆ మహిళ చెప్పింది. అదే సమయంలో.. నిందితుడు రాజేష్ కు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదని కూడా ఆమె పేర్కొంది.