Pod Taxi: ఇండియాలో పాడ్ ట్యాక్సీ.. వచ్చేది ఇక్కడే..!
Pod Taxi : భారతదేశంలో తొలిసారిగా పాడ్ ట్యాక్సీ సేవలను ప్రారంభించేందుకు ముంబైలో ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.
- Harish Thanniru
- Updated on- June 15, 2026 / 03:09 PM IST
pod taxis in mumbai
Pod Taxi in Mumbai : భారతదేశంలో తొలిసారిగా పాడ్ ట్యాక్సీ సేవలను ప్రారంభించేందుకు ముంబైలో ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ముంబై నగరంలో ట్రాఫిక్ సమస్య విపరీతంగా ఉంటుంది. దీంతో నగరంలోని రద్దీ ప్రాంతమైన బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ (BKC)లో పాడ్ ట్యాక్సీ రవాణా వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు నిర్ణయించారు.
ఈ ప్రాజెక్టు ప్రకారం.. 3.36 కిలోమీటర్ల పొడవైన మార్గంలో మొత్తం 8 స్టేషన్లతో పాడ్ ట్యాక్సీ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయనున్నారు. మెట్రో రైళ్ల మాదిరిగా ఎలివేటెడ్ ట్రాక్‌పై ఈ ట్యాక్సీలు నడుస్తాయి. ప్రతి పాడ్ ట్యాక్సీలో ఆరుగురు ప్రయాణికులు ప్రయాణించగలరు. ఈ పాడ్ ట్యాక్సీల గరిష్ట వేగం గంటకు 40 కిలోమీటర్లుగా ఉండనుంది. ప్రత్యేకత ఏమిటంటే ప్రతి 15 సెకన్లకోసారి ఒక పాడ్ ట్యాక్సీ అందుబాటులోకి రానుంది. దీంతో ప్రయాణికులు ఎక్కువసేపు వేచి ఉండాల్సిన అవసరం ఉండదు.
మెట్రో, లోకల్ రైళ్లలో ప్రయాణించి బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ ప్రాంతంలోని కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులకు ఈ సేవలు ఎంతో ఉపయోగకరంగా ఉండనున్నాయి. స్టేషన్ల నుంచి కార్యాలయాలకు చేరుకోవడంలో ఎదురయ్యే ట్రాఫిక్ ఇబ్బందులను తగ్గించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యంగా అధికారులు చెబుతున్నారు. అయితే, పాడ్ ట్యాక్సీల్లో ప్రయాణం చేయాలంటే చార్జీలు కాస్త ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. ప్రాథమిక అంచనాల ప్రకారం ప్రతి కిలోమీటర్ ప్రయాణానికి సుమారు రూ.21 వరకు వసూలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు 2031 నాటికి పూర్తై ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ప్రాజెక్టు విజయవంతమైతే భవిష్యత్తులో దేశంలోని ఇతర మహానగరాలకు కూడా విస్తరించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.
పాడ్ ట్యాక్సీలు చిన్నపాటి కార్లను పోలి ఉంటాయి. వీటికి డ్రైవర్ ఉండరు. పూర్తిగా కంప్యూటర్ ఆధారితంగా, విద్యుత్ లేదంటే బ్యాటరీ సహాయంతో నడుస్తాయి. ఇవి రోడ్డుపైనే కాకుండా.. రోడ్డుకు పైన నిర్మించిన ప్రత్యేకమైన ఎలివేటెడ్ ట్రాక్ లపై కూడా ప్రయాణిస్తాయి. పాడ్ టాక్సీలు అందుబాటులోకి వస్తే ప్రధాన నగరాల్లో ట్రాఫిక్ సమస్యకు చెక్ పడుతుంది.
