Police lathicharge on farmers near Bhagwant Mann`s house in Punjab
Punjab: తమ సమస్యలు పరిష్కరించాలంటూ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఇంటి వద్ద ఆందోళనకు దిగిన రైతులు, కార్మిక సంఘాల నేతలపై పోలీసులు లాఠీలతో విరుచుకుపడ్డారు. దీంతో సంగ్రూర్‌లోని సీఎం నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వాస్తవానికి రైతులు శాంతియుతంగా నిరసన చేపట్టారు. ముఖ్యమంత్రి సైతం రాష్ట్రంలో లేరు. కానీ, నిరసన చేస్తున్న వారిపై పోలీసులు విరుచుకుపడ్డ తీరు పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. అంతే కాకుండా, కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా పంజాబీ రైతులు ప్రముఖంగా ఉండి ఆందోళన చేసినప్పుడు వారితో ఆప్ వ్యవహరించిన తీరును, ప్రస్తుతం వ్యవహరించిన తీరును పోలుస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు.
Education in Mother Tongue: మాతృ భాషలో ఉన్నత విద్యపై కీలక వ్యాఖ్యలు చేసిన అమిత్ షా
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం కింద కనీన వేతనాలను 700 రూపాయలకు పెంచాలని, గ్రామీణ సహకార సంఘాల్లో దళితులకు 33 శాతం ప్రాతినిధ్యం కల్పించాలని, భూ సేకరణ రిలీఫ్‌ను పెంచాలని, లుంపీస్కిన్ వ్యాధితో మరణించిన పశువులకు పరిహారం చెల్లించాలని, పాడైన పంటలకు రీయంబర్స్‌మెంట్ విడుదల చేయాలని, పంట తగల బెట్టిన వారిపై కేసులను ఎత్తివేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్లను నెరవేర్చాలని సీఎం భగవంత్ మాన్ ఇంటి ముందు శాంతియుత నిరసనకు దిగారు. అయితే ఈ నిరసన హైవేపై కొనసాగుతుండడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు.
కానీ, వారు అక్కడి నుంచి వెళ్లేందుకు ససేమిరా అనడంతో పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు లాఠీ చార్జ్ చేసినట్లు ఓ పోలీసు అధికారి తెలిపారు. కాగా, రైతులపై లాఠీ చార్జ్ చేయడాన్ని విపక్షాలు ముక్త కంఠంతో ఖండించాయి. లాఠీచార్జి దురదష్టకరమని, ఆప్ వంచనకు ఇది అద్దంపడుతుందని శిరోమణి అకాలీ దళ్ నేత మహేషిందర్ సింగ్ గ్రేవాల్ మండిపడ్డారు. పంజాబ్ సొమ్మంతా గుజరాత్ ఎన్నికల్లో కేజ్రీవాల్ ఖర్చుపెడుతున్నారని బీజేపీ నేత మంజిందర్ సింగ్ సిర్సా ఆరోపించారు. ఇక నెటిజెన్లు సైతం ఈ విషయమై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాగు చట్టాల వ్యతిరేక ఆందోళన సమయంలో ఆప్ తీరు, నేటి తీరు ఒకే విధంగా లేదని విమర్శిస్తున్నారు.