Sonam Wangchuk : సోనం వాంగ్‌చుక్ దీక్ష భగ్నం.. ఆస్పత్రికి తరలింపు..
Sonam Wangchuk : ప్రముఖ పర్యావరణవేత్త సోనం వాంగ్‌చుక్ ఆమరణ దీక్షను ఢిల్లీ పోలీసులు భగ్నం చేశారు.
- Harish Thanniru
- Published on- July 18, 2026 / 09:19 AM IST
Sonam Wangchuk
- సోనం వాంగ్‌చుక్ దీక్ష భగ్నం
- బలవంతంగా ఆస్పత్రికి తరలించిన పోలీసులు
- అడ్డుకునేందుకు ప్రయత్నించిన నిరసనకారులు
Sonam Wangchuk : ప్రముఖ పర్యావరణవేత్త సోనం వాంగ్‌చుక్ ఆమరణ దీక్షను ఢిల్లీ పోలీసులు భగ్నం చేశారు. విద్యా వ్యవస్థలో పటిష్టమైన సంస్కరణలు తీసుకురావాలని, ఇటీవల పేపర్ లీకేజీలకు బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ గత 21రోజులుగా వాంగ్‌చుక్ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఆయన ఆరోగ్యం క్షీణించడంతో శనివారం ఉదయం ఆయన్ను బలవంతంగా దీక్షా శిబిరం నుంచి ఆస్పత్రికి తరలించారు.
ఆమరణ దీక్ష సందర్భంగా వాంగ్‌చుక్ ఆరోగ్యం క్షీణించింది. ఆయన దాదాపు తొమ్మిది కేజీల బరువు తగ్గగా.. ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఢిల్లీ హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు, వైద్య నిపుణుల సూచనల మేరకు సోనం వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని పోలీసులు బలవంతంగా ఆయన్ను దీక్షా శిబిరం నుంచి ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో నిరసనకారులు పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. పెద్దెత్తున నినాదాలు చేస్తూ భారీగా గుమ్మికూడారు. దీంతో ఆ ప్రాంతంలో కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. చివరికి పోలీసులు బలవంతంగా వాంగ్‌చుక్ ను దీక్షాశిబిరం నుంచి ఆస్పత్రికి తీసుకెళ్లారు.
