సార్వత్రిక ఎన్నికల వేళ ఈసీ ప్రతి అంశంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే సహించేది లేదంటోంది.
ముంబై: సార్వత్రిక ఎన్నికల వేళ ఈసీ ప్రతి అంశంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే సహించేది లేదంటోంది. ఎన్నికల కోడ్ బ్రేక్ చేసిన వారిపై చర్యలు తీసుకుంటోంది. చివరికి సీరియళ్లను కూడా ఈసీ వదల్లేదు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని రెండు హిందీ సీరియల్స్ నిర్మాతలకు ఎన్నికల సంఘం నోటీసులు ఇచ్చింది. జీ టీవీ, అండ్ టీవీలో వచ్చే సీరియల్స్ పై కోడ్ ఉల్లంఘన ఫిర్యాదులు వచ్చాయని మహారాష్ట్ర అదనపు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ దిలీప్ షిండే తెలిపారు. ఫిర్యాదు మేరకు ఆ సీరియళ్ల నిర్మాతలకు నోటీసులు పంపామని, 24గంటల్లో వివరణ కోరామని చెప్పారు. వారి వివరణ వచ్చాక చర్యలు తీసుకుంటామన్నారు.
Read Also : సమంత పిలుపు : ఆ టీడీపీ అభ్యర్థిని గెలిపించండి
ఎన్నికల కోడ్ కు విరుద్ధంగా సీరియల్స్ లో ప్రభుత్వ పథకాలను ప్రచారం చేస్తున్నారని మహారాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించిన ఆ 2 సీరియల్స్ ను బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు. ఆ సీరియల్స్ నిర్మాతలు, నటులపై కేసులు నమోదు చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం చివరికి సీరియళ్లను కూడా తమ పబ్లిసిటీకి వాడుకోవడం దారుణం అని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ సచిన్ సావంత్ అన్నారు. తమ ఫిర్యాదుకి సాక్ష్యంగా వీడియో క్లిప్పింగ్స్ ను ఆయన ఎన్నికల అధికారులకు ఇచ్చారు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉజ్వల పథకం, స్వచ్ఛ భారత్, ముద్ర యోజన పథకాలను ఆ సీరియల్స్ లో పదే పదే చూపించారని, ఓటర్లను ప్రలోభపెట్టే ప్రయత్నం చేశారనేది కాంగ్రెస్ నేతల ఆరోపణ. ఇందుకోసం కోట్ల రూపాయలు ఇచ్చారని అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు.
Read Also : 11న సెలవు ప్రకటించని సంస్థలపై చర్యలు : దాన కిషోర్