Prashant Kishor : ఉప ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ ఘన విజయం.. బీజేపీ కంచుకోట బద్దలు
Prashant Kishor : ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, జన్ సూరజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ ( Prashant Kishor ).. ప్రత్యక్ష ఎన్నికల తొలి పోరులో విజయం సాధించారు.
- Harish Thanniru
- Updated on- August 3, 2026 / 05:35 PM IST
Prashant Kishor victory in Bankipur Assembly by-election in Bihar
Prashant Kishor : ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, జన్‌సూరజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ ఉపఎన్నికల్లో ఘన విజయం సాధించారు. బిహార్ రాష్ట్రంలోని బంకీపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికలకు సంబంధించిన ఓట్లను ఇవాళ లెక్కించారు. తాజాగా.. కౌంటింగ్ పూర్తికాగా.. ప్రశాంత్ కిశోర్ ఘనవిజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి, తన సమీప ప్రత్యర్థి అయిన నీరజ్ కుమార్ సిన్హాపై సుమారు 20వేల ఓట్లకుపైగా మెజారిటీతో ఆయన విజయదుందబి మోగించారు. ప్రత్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన ప్రశాంత్ కిషోర్ తొలిసారి చట్టసభల్లో అడుగుపెట్టనున్నారు.
Also Read : Pak Submarine : పాక్ సబ్‌మెరైన్ ప్లాన్‌కి భారత్ దగ్గర జవాబు ఉందా? అలాచేస్తే పాక్ ఫ్యూజులు మాడిపోతాయ్..
బంకీపూర్ అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీకి కంచుకోట. 30ఏళ్లుగా బీజేపీ ఇక్కడ విజయం సాధిస్తుంది. 1995 నుంచి వరుసగా బీజేపీ అభ్యర్థులదే ఇక్కడ విజయం. గతంలో అది పాట్నా వెస్ట్ నియోజకవర్గం. ఆ తర్వాత 2010లో బంకీపూర్‌గా మారింది. 1995 నుంచి 2005 వరకు నవీన్ కిశోర్ ప్రసాద్ సిన్హా (1995, 2000, 2005) ఈ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. 2006 నుంచి నితిన్ నబీన్ (2006 బైఎలక్షన్, 2010, 2015, 2020, 2025) ఎన్నికల్లో వరుసగా నితిన్ నబీన్ విజయం సాధిస్తూ వచ్చారు. అయితే, వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన నితిన్ నబిన్ 2026 ఏప్రిల్ లో రాజ్యసభకు ఎన్నికయ్యారు.
ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో బంకీపూర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వచ్చింది. ఈ ఎన్నికల్లో నితీన్ నబిన్ అత్యంత సన్నిహితుడు, చిన్ననాటి స్నేహితుడైన నీరజ్ కుమార్ సిన్హా బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగాడు. ఆర్జేడీ నుంచి రేఖా కుమారి గుప్తా పోటీ చేయగా.. జనసూరజ్ పార్టీ నుంచి ప్రశాంత్ కిషోర్ బరిలో నిలిచారు. జులై 30వ తేదీ ఈ నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరిగింది. ఇవాళ (ఆగస్టు 3న) ఓట్ల లెక్కింపు జరిగింది. నియోజకవర్గ ప్రజలు ఎన్నోఏళ్లుగా బీజేపీకి అండగా నిలవగా.. ప్రస్తుతం ఉప ఎన్నికల్లో బీజేపీకి గట్టిషాకిచ్చి ప్రశాంత్ కిషోర్ కు పట్టం కట్టారు.
ఓట్ల లెక్కింపులో భాగంగా.. మొత్తం 31 రౌండ్లలో ఎన్నికల అధికారులు కౌంటింగ్ పూర్తి చేశారు. రెండుమూడు రౌండ్లు మినహా మిగిలిన అన్ని రౌండ్లలోనూ ప్రశాంత్ కిషోర్ తన మెజార్టీ సాధించడం విశేషం. బీజేపీకి కంచుకోట అయిన నియోజకవర్గంలో ప్రశాంత్ కిషోర్ విజయం సాధించడం బీహార్ రాష్ట్ర రాజకీయాల్లోనేకాక దేశ రాజకీయాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. ఇటీవల నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో దేశవ్యాప్తంగా జరిగిన ఆందోళనలు.. ముఖ్యంగా జంతర్ మంతర్ వద్ద జరిగిన విద్యార్థుల నిరసనలు.. ఈ ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఓటమిలో ఓ కారణంగా రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
