Narendra Modi: జెన్‌జీకి మోదీ సీరియస్ మెసేజ్.. అడ్డదారులు వద్దు.. బలైపోతారు..
నేటి వేగవంతమైన డిజిటల్ యుగంలో పయనిస్తున్న జెన్‌జీ యువతను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) సంచలన వ్యాఖ్యలు చేశారు.
- V Santhosh Kumar
- Published on- August 12, 2026 / 03:03 PM IST
Prime Minister Narendra Modi makes sensational comments about Gen Z Students
- అడ్డదారులు ఎంచుకుంటే తీవ్ర నష్టం.
- రీల్స్ విడిచి మహనీయులను చదవండి.
- ప్రతిభతో కెరీర్‌పై దృష్టి పెట్టండి.
Narendra Modi: మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆత్మకథ ‘Triumph of the Indian Republic: My Life, My Struggles’ పుస్తకావిష్కరణ వేడుక ఢిల్లీలో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi), నేటి వేగవంతమైన డిజిటల్ యుగంలో పయనిస్తున్న జెన్‌జీ (Gen Z) యువతను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. సాంకేతికత పెరిగిన ఈ రోజుల్లో యువత తమ లక్ష్యాలను సాధించడానికి ఎంచుకుంటున్న మార్గాలు, వారి ఆలోచనా దృక్పథంపై మోదీ ప్రత్యేకంగా దృష్టి సారించారు.
షార్ట్‌కట్‌లు వద్దంటూ రైల్వే పాఠం:
జీవితంలో వేగంగా ఉన్నత స్థానాలకు చేరుకోవడానికి అడ్డదారులు వెతికితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రధాని స్పష్టం చేశారు. రైల్వే స్టేషన్లలో తరచూ కనిపించే ‘A shortcut will cut you short’ అనే హెచ్చరిక బోర్డును ఈ సందర్భంగా ఆయన ఉదాహరణగా చెప్పారు. సమయం ఆదా చేసుకోవడానికి ఫుట్‌బ్రిడ్జ్ వాడకుండా రైలు పట్టాలు దాటే ప్రయత్నం చేయడం ఎంత ప్రమాదకరమో, కెరీర్‌లో అనుసరించే అడ్డదారులు కూడా అంతే ముప్పు తెస్తాయని హెచ్చరించారు. రీల్స్, ఇన్‌ఫ్లుయెన్సర్ల భ్రమల్లో పడకుండా మహనీయుల ఆత్మకథలు చదివి ప్రేరణ పొందాలని పిలుపునిచ్చారు.
రీల్స్ దాటి కెరీర్‌పై దృష్టి పెట్టాలి:
ఈ మధ్యకాలంలో యువతకు మరింత దగ్గరయ్యేందుకు మోదీ తన సోషల్ మీడియా విధానంలో మార్పులు తెచ్చిన సంగతి తెలిసిందే. ఇన్‌స్టాగ్రామ్‌లో సెల్ఫీ వీడియోలు పోస్ట్ చేస్తూ, నేటితరం వాడుక భాషలోనే వారితో కనెక్ట్ అవుతున్నారు. అయితే, కేవలం డిజిటల్ రీల్స్ చూడటానికి, చేయడానికి మాత్రమే కాలాన్ని పరిమితం చేయకుండా, తమలోని నిజమైన ప్రతిభను వెలికితీసి కెరీర్‌పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని ప్రధాని యువతకు హితవు పలికారు
