ఢిల్లీ: భారతదేశం ప్రధానంగా వ్యవసాయం రంగంపైనే ఆధారపడిన దేశం. రైతే దేశానికి వెన్నెముకలాంటివాడు. అందుకే ఎన్డీయే ప్రభుత్వం దేశంలోని కోట్లాదిమంది రైతులకు లబ్ది చేకూర్చేందుకు పీఎం కిసాన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. 2019–20 మధ్యంతర బడ్జెట్‌లో ప్రకటించిన విషయం తెలిసిందే. దీని కోసం బడ్జెట్‌లో రూ.75 వేల కోట్లు కేటాయించింది. ఈ పథకం కింద ఒక్కో రైతు కుటుంబానికి ఏటా 6 వేలు, మూడు విడతలుగా అందించనున్న క్రమంలో రూ. 2000 సాయాన్ని రైతుల ఖాతాల్లోకి బదిలీ చేయబడుతుంది. ఈ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫిబ్రవరి 24వ తేదీన ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో బటన్ నొక్కి లాంఛనంగా ప్రారంభించనున్నారు. దీంట్లో భాగంగా తొలివిడతంగా కోటిమందికి పైగా రైతులు లబ్ది పొందనున్నారు.
5 ఎకరాల్లోపు భూమి ఉన్న రైతులకు ఏడాదికి రూ.6 వేలను మూడు విడతలుగా అందిం చడం కేంద్రం లక్ష్యం కాగా మొదటి విడతలో కోటి మందికి పైగా లబ్ధిదారులకు రూ.2 వేలు చొప్పున అందించనున్నారు. పీఎం–కిసాన్ పోర్టల్‌లో నమోదైన రైతుల బ్యాంకు ఖాతాల్లో ఈ పథకం ద్వారా వచ్చే నగదు జమ కానుంది. రెండో విడతలో రూ.2 వేలను ఏప్రిల్ ఒకటో తేదీన విడుదల చేయనుంది. ఇప్పటికే 12 రాష్ట్రాల్లో 95 శాతం వివరాలు..9 రాష్ట్రాల్లో 80 శాతం రైతుల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు కాగా మిగతా రాష్ట్రాలు కాస్తంత వెనుకబడి ఉన్నాయని అధికారులు తెలిపారు.
గిరిజన రైతుల కోసం ప్రత్యేక విధానం
ఈశాన్య రాష్ర్టాల్లోని రైతులకు, గిరిజన రైతులకు నగదు అందజేసేందుకు అధికారులు ప్రత్యేక విధానాలకు అవలంబించనున్నారు. అటవీ ప్రాంతాల్లోని వ్యవసాయ భూములపై యాజమాన్య హక్కులున్న గిరిజన రైతులకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేయనున్నారు.