Kottampatti Tragedy: ఘోర రోడ్డు ప్రమాదం.. ప్రభుత్వ బస్సును ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు.. ఐదుగురు దుర్మరణం
తమిళనాడులోని మదురై జిల్లా కొట్టంపట్టి(Kottampatti Tragedy) సమీపంలో సోమవారం తెల్లవారుజామున ఒక భీకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
- V Santhosh Kumar
- Published on- July 13, 2026 / 10:07 AM IST
Private and hrtc bus collide in kottampatti five dead 2 seriously injured
- మదురై హైవేపై ఘోర ప్రమాదం
- ఐదుగురు ప్రయాణికులు అక్కడికక్కడే దుర్మరణం
- నలభై రెండు మందికి తీవ్రగాయాలు
Kottampatti Tragedy: తమిళనాడులోని మదురై జిల్లా కొట్టంపట్టి సమీపంలో(Kottampatti Tragedy) సోమవారం తెల్లవారుజామున ఒక భీకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చెన్నై నుండి మార్తాండం వైపు అతివేగంగా దూసుకెళ్తున్న ఒక ప్రైవేట్ ఆమ్ని బస్సు అకస్మాత్తుగా నియంత్రణ కోల్పోయింది. రోడ్డు మధ్యలోని డివైడర్‌ను దాటుకుంటూ అవతలి వైపునకు దూసుకెళ్లి, ఎదురుగా వస్తున్న ప్రభుత్వ రవాణా సంస్థ (SETC) బస్సును అత్యంత బలంగా ఢీకొట్టింది. ఈ ఘోర దుర్ఘటనలో ఐదుగురు ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 42 మంది తీవ్రంగా గాయపడ్డారు.
ఈ ప్రమాదం ఎంత తీవ్రంగా జరిగిందంటే, ఢీకొట్టిన వేగానికి ప్రైవేటు బస్సు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయి రోడ్డు పక్కనే ఉన్న బస్ షెల్టర్‌లోకి దూసుకుపోయింది. అదే సమయంలో ప్రభుత్వ బస్సు రహదారిపైనే బోర్లా పడింది. తెల్లవారుజామున ప్రైవేట్ బస్సు డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడమే ఈ ఘోర ప్రమాదానికి ప్రధాన కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
సమాచారం అందుకున్న కొట్టంపట్టి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. బస్సు శిథిలాల మధ్య నలిగిపోయి చిక్కుకున్న బాధితులను ఎంతో శ్రమించి బయటకు తీశారు. గాయపడిన 42 మందిని తక్షణమే మదురై రాజాజీ ప్రభుత్వ ఆసుపత్రి, మేలూరు ఆసుపత్రులకు తరలించారు. క్షతగాత్రులలో కొందరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. ఈ ఘోర ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
