Amritpal Singh: ఖలిస్తాన్ మద్దతుదారు అమృతపాల్ సింగ్ సహా అతని తొమ్మిది మంది సహచరులు అస్సాంలోని దిబ్రూగఢ్ జైలులో నిరాహార దీక్ష ప్రారంభించారు. ఇక అమృతపాల్ భార్య కిరణ్‌దీప్ కౌర్ కూడా తన భర్తకు మద్దతుగా జైలు బయట నిరాహార దీక్షకు కూర్చున్నారు. లాయర్‌ను కలవడానికి ప్రభుత్వం అనుమతించడం లేదని అమృతపాల్, అతని భార్య కిరణ్ దీప్ కౌర్ అంటున్నారు. ఇదిలావుండగా, ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని న్యాయవాదుల సమావేశానికి అనుమతి ఇవ్వాలని శిరోమణి గురుద్వారా పర్బంధక్ కమిటీ (ఎస్‌జీపీసీ) అధ్యక్షుడు హర్జీందర్ సింగ్ ధామీ ఎస్‌జీపీసీ లీగల్ సెల్‌ను ఆదేశించారు.
మరోవైపు, జైలులో ఉన్న యువకులను న్యాయవాదులను కలవడానికి అనుమతించకపోవడాన్ని అకల్ తఖ్త్ సాహిబ్ జియానీ రఘ్‌బీర్ సింగ్ జతేదార్ కూడా ఖండించారు. జాతీయ భద్రతా చట్టం (ఎన్‌ఎస్‌ఏ) కింద అమృతపాల్‌ను పంజాబ్‌లో అరెస్టు చేశారు. అనంతరం అసోం జైలుకు తరలించారు. అమృతపాల్, అతని సహచరులు తమ న్యాయవాది రాజ్‌దేవ్ సింగ్‌ను కలవడానికి అనుమతించడం లేదని భార్య కిరణ్‌దీప్ కౌర్ చెప్పారు. న్యాయవాదిని కలిసే హక్కు అతనికి ఉందని, అమృతపాల్ సహా అతని సహచరులు ఐదు రోజులుగా జైలులో సమ్మె చేస్తున్నా, గత ఐదు రోజులుగా పరిష్కారం రాలేదని ఆమె అంటున్నారు.
ఇది కూడా చదవండి: ZA Islamia College: బిహార్ కాలేజీలో వింత రూల్స్.. కలిసి నవ్వినా కాలేజీ నుంచి పంపించేస్తారట
సెప్టెంబర్ 28న అమృత్‌సర్ డీసీకి వ్యతిరేకంగా దిబ్రూగఢ్ జైలు సూపరింటెండెంట్‌కు అమృతపాల్ లేఖ రాయడం గమనార్హం. అమృత్‌సర్ డీసీ తన అధికారాలను దుర్వినియోగం చేస్తున్నారని అందులో రాశారు. అతని న్యాయవాది రాజ్‌దేవ్ సింగ్ ఖల్సాను కలవడానికి అనుమతించడం లేదట. కాగా ఆయన న్యాయవాది అన్ని షరతులను పూర్తి చేసినట్లు లేఖలో పేర్కొన్నారు. దిబ్రూగఢ్ జైలులో అమృతపాల్ సహా అతని సహచరులు చేస్తున్న రెండవ సమ్మె ఇది. కొంతకాలం క్రితం కూడా జైల్లో నిరాహారదీక్ష చేశారు. తన ఆహారంలో ఉద్దేశపూర్వకంగా పొగాకు కలుపుతున్నారని అప్పట్లో నిరాహార దీక్షకు దిగారు.