ప్రొఫెసర్ సాయిబాబా నిర్దోషి.. బాంబే హైకోర్టు తీర్పు
ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ సాయిబాబాకు జైలు జీవితం నుంచి విముక్తి లభించనుంది.
- Naga Srinivasa Rao Poduri
- Updated on- March 5, 2024 / 11:39 AM IST
Professor Saibaba 5 others acquitted in Maoist link case
Professor Saibaba: ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాకు జైలు జీవితం నుంచి విముక్తి లభించనుంది. మావోయిస్టులతో లింక్ కేసులో సాయిబాబాతో పాటు మరో ఐదుగురిని బాంబే హైకోర్టు నిర్దోషులుగా మంగళవారం ప్రకటించింది. తమను దోషులుగా ప్రకటిస్తూ 2017లో గడ్చిరోలి సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సాయిబాబా, ఇతరులు చేసిన అప్పీల్‌పై బాంబే హైకోర్టు నేడు తీర్పు వెలువరించింది. నిందితులపై మోపిన కేసును కొట్టివేసింది. పిటిషన్‌ను విచారించిన వినయ్ జోషి, వాల్మీకి ఎస్‌ఏ మెనెజెస్‌లతో కూడిన నాగపూర్ బెంచ్ ఈ మేరకు తీర్పు ఇచ్చింది. నిందితులపై కేసును నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని ధర్మాసనం పేర్కొంది.
మావోయిస్టులతో సంబంధాలు కలిగి ఉన్నారనే అభియోగాలతో సాయిబాబాను 2014, మే నెలలో మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. యూఏపీఏ చట్టం కింద సాయిబాబాపై అభియోగాలు మోపటంతో ఆయనకు గడ్చిరోలిలోని సెషన్స్ కోర్టు యావజ్జీవ ఖైదు విధించింది. దీనిని బాంబే హైకోర్టులో సాయిబాబా సవాల్ చేయగా.. 2022, అక్టోబర్ 14న యావజ్జీవ ఖైదును రద్దు చేసింది. సాయిబాబాను వెంటనే విడుదల చేయాలని కూడా బాంబే హైకోర్టు ఆదేశించింది. అయితే ప్రొఫెసర్ సాయిబాబా రిలీజ్‌పై సుప్రీంకోర్టు స్టే విధించడంతో అప్పట్లో ఆయనకు ఊరట లభించలేదు.
యాభై నాలుగేళ్ల సాయిబాబా వీల్‌చైర్‌కే పరిమితమైన దివ్యాంగుడు. ఆయన ప్రస్తుతం నాగ్‌పూర్ సెంట్రల్ జైలులో ఉన్నారు. ఆయన పూర్తి పేరు గోకరకొండ నాగ సాయిబాబా. ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని రామ్ లాల్ ఆనంద్ కళాశాలలో ఇంగ్లీష్ ప్రొఫెసర్‌గా సాయిబాబా చాలా కాలం పనిచేశారు. మావోయిస్టులతో సంబంధాలున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటూ జైలుపాలు కావడంతో 2021, ఫిబ్రవరిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం నుంచి ఆయనను తొలగించారు.
Also Read: ఈ సమ్మర్‌లో మాడు పగలడం ఖాయం..! ఈసారి సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదు, ఏపీ తెలంగాణలో మంటలే
