గేట్ వే ఆఫ్ ఇండియా వద్ద Free Kashmir బోర్డుతో విద్యార్థుల ఆందోళన

జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీపై ఆదివారం జరిపిన దాడులకు వ్యతిరేకంగా విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. ముంబై అనగానే గుర్తొచ్చే గేట్ వే ఆఫ్ ఇండియాను చుట్టుముట్టి ఆందోళన చేశారు. సాయంత్రం 6గంటలకు మొదలైన ఈ ఆందోళన అర్ధరాత్రి వరకూ కొనసాగుతూనే ఉంది. 

ఈ ఘటనలో విచిత్రంగా మరో ఫ్లకార్డు దర్శనమిచ్చింది.  ‘Free Kashmir’ అంటూ ఓ స్టూడెంట్ కనిపించింది. మరో వ్యక్తి ‘Ban on ABVP’ ఏబీవీపీని నిషేదించండి, ‘Stand with JNU’ జేఎన్‌యూకి సపోర్ట్ చేయండంటూ నిరసన వ్యక్తం చేశారు. ముంబైలోని పలు కాలేజీల నుంచి విద్యార్థులు గుమిగూడి జేఎన్యూ దాడుల గురించి నిరసన తెలియజేశారు.

30కి పైగా విద్యార్థులు, మరి కొందరు ప్రొఫెసర్లు కూడా ఆందోళనలో పాల్గొన్నారు. సోమవారం ఉదయం వీరికి మద్ధతుగా బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ సైతం గేట్ వే ఆఫ్ ఇండియాకు చేరుకుని తన మద్ధతుని తెలియజేశాడు. ఇదే అదనుగా ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ స్టూడెంట్స్ కు సపోర్ట్ ఇచ్చారు.

ముసుగులేసుకుని జేఎన్ యూలోకి చొరబడడంపై నిరసనలు వ్యక్తమయ్యాయి. జేఎన్ యూలో హింసను తీవ్రంగా ఖండిస్తూ విద్యార్థులంతా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. విద్యార్థుల ఆందోళన ప్రారంభమైనప్పటి నుంచి కొంతమంది విద్యార్థుల బృందాలు కొవ్వొత్తుల ప్రదర్శనతో జేఎన్ యూ విద్యార్థులకు సంఘీభావాన్ని తెలిపారు.