జయహో భారత్ : ఇస్రో రాకెట్ సూపర్ సక్సెస్

  • Publish Date - April 1, 2019 / 04:29 AM IST

ఏపీ రాష్ట్రం నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట శ్రీహరికోటలోని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి పీఎస్‌ఎల్వీ సీ-45 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. మొత్తం 29 ఉపగ్రహాలను.. మూడు కక్ష్యల్లోకి ఒకే రాకెట్ ద్వారా ప్రవేశపెట్టి ప్రపంచాన్ని ఔరా అనిపించింది ఇస్రో. ఒక రాకెట్ ద్వారా ఒకే కక్ష్యలోని శాటిలైట్లను ప్రవేశపెట్టటం రొటీన్.. ఈసారి ఇస్రో అభివృద్ధి చేసిన టెక్నాలజీ ద్వారా.. మూడు కక్ష్యల్లోని 29 శాటిలైట్లను ప్రవేశపెట్టటం ద్వారా.. అంతర్జాతీయంగా ఘనకీర్తిని సాధించింది. 
ఈ ప్రయోగం మూడు గంటలు సాగింది. రాడార్ వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు ఇస్రో ఈ ప్రయోగం చేసింది. మొదట మన రక్షణ శాఖకు చెందిన ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. తర్వాత మిగిలిన విదేశీ ఉపగ్రహాలను ఒకదాని తర్వాత ఒకటి కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది. అమెరికాకు చెందిన 20 భూపరిశీలన నానో ఉపగ్రహాలు, లిథువేనియాకు చెందిన రెండు, స్విట్జర్లాండ్‌, స్పెయిన్‌కు చెందిన ఉపగ్రహాలను భూమికి 504 కిలోమీటర్ల ఎత్తులో విడిచిపెట్టనుంది. 

ఇస్రోలోని రెండో ప్రయోగ వేదిక నుంచి సోమవారం ఉదయం 9.27 గంటలకు పీఎస్‌ఎల్వీ సీ45 (పీఎస్‌ఎల్‌వీ–క్యూఎల్‌) ఉపగ్రహ వాహక నౌకను శాస్త్రవేత్తలు రోదసీలోకి పంపారు. ఆదివారం ఉదయం 6:27 గంటలకు కౌంట్‌ డౌన్‌ ప్రారంభం కాగా ఇది పీఎస్‌ఎల్వీ రాకెట్‌ సిరీస్‌లో 47వ ప్రయోగం. షార్‌ కేంద్రం నుంచి 71వ ప్రయోగం అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నాలుగు స్ట్రాపాన్‌ బూస్టర్లు సాయంతో చేస్తున్న ప్రయోగం ఇది. దీనికి పీఎస్‌ఎల్వీ-క్యూఎల్‌ అనే పేరు పెట్టారు. ఈ తరహా రాకెట్‌ను మొట్టమొదటిసారిగా ఇస్రో ప్రయోగించింది. విజయవంతం అయ్యింది.