ఆసియా అథ్లెటిక్స్‌ : చిత్ర ఉన్నికృష్ణన్‌‌కు స్వర్ణం

  • Publish Date - April 25, 2019 / 03:51 AM IST

దోహా వేదికగా జరుగుతున్న ఆసియా అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో ఉమెన్స్ రేస్ లో చిత్ర ఉన్నికృష్ణన్‌ (23) స్వర్ణంతో మెరిసింది. 1500 మీటర్ల రేస్ ను 4 నిమిషాల 14.56 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని  దక్కించుకుంది. ఫినిషింగ్‌ లైన్‌కు కొన్ని మీటర్ల దూరంలో బహ్రెయిన్‌ అథ్లెట్‌ గషా టైగెస్ట్‌ను దాటి ముందుకెళ్లింది. ఈ టోర్నీలో భారత్‌కు లభించిన మూడో పసిడి పతకమిది.

ఆసియా అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో చివరి రోజూ భారత అథ్లెట్స్‌ పతకాల పంట పండించారు. బుధవారం (ఏప్రిల్ 24,2019) ముగిసిన ఈ మెగా ఈవెంట్‌లో ఒక స్వర్ణం, రెండు రజతాలు, ఒక కాంస్యం దక్కాయి. భారత్‌కు ఈ పోటీల్లో 3 స్వర్ణాలు, 7 రజతాలు, 7 కాంస్యాలతో కలిపి 17 పతకాలు లభించాయి. పతకాల పట్టికలో భారత్‌ నాలుగో స్థానంలో నిలిచింది. ఈ పోటీల్లో భారత్‌కు లభించిన మూడో  పసిడి పతకమిది. మహిళల 200 మీటర్ల విభాగంలో ఒడిశా అథ్లెట్‌ ద్యుతీ చంద్‌ కాంస్య పతకాన్ని సాధించింది. తెలంగాణ కోచ్‌ నాగపురి రమేశ్‌ పర్యవేక్షణలో శిక్షణ తీసుకుంటున్న ద్యుతీ చంద్‌ 23.24 సెకన్లలో రేసును ముగించి మూడో స్థానంలో నిలిచింది.

మహిళల 4*400 మీటర్ల రిలేలో ప్రాచి, పూవమ్మ రాజు, సరితాబెన్‌ గైక్వాడ్, విస్మయలతో కూడిన భారత బృందానికి రజతం
పురుషుల 1500 మీటర్ల రేసులో అజయ్‌ కుమార్‌ సరోజ్‌ కి రజతం
పురుషుల 4*400 మీటర్ల రిలేలో కున్హు మొహమ్మద్, జీవన్, అనస్, అరోకియా రాజీవ్‌లతో కూడిన భారత బృందానికి రజతం
మహిళల డిస్కస్‌ త్రోలో నవజీత్‌ కౌర్‌ (57.47 మీటర్లు) నాలుగో స్థానంలో… కమల్‌ ప్రీత్‌ కౌర్‌ (55.59 మీటర్లు) ఐదో స్థానంలో నిలిచారు
పురుషుల 5000 మీటర్ల రేసులో మురళి ఐదో స్థానంలో, అభిషేక్‌ ఆరో స్థానంలో నిలిచారు.