Punjab-Chhattisgarh..కాంగ్రెస్ లో అంతర్గత కుమ్ములాటలు తీవ్రస్థాయికి

అధికారంలో ఉన్న పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమస్యలు ఎదుర్కొంటోంది.

Congress

Punjab-Chhattisgarh అధికారంలో ఉన్న పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమస్యలు ఎదుర్కొంటోంది. ఇప్పటికే మధ్యప్రదేశ్‌లో అధికారాన్ని కోల్పోగా, రాజస్థాన్‌, పంజాబ్‌ రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్‌ని అంతర్గత విభేదాలు వెంటాడుతున్నాయి. తాజాగా ఛత్తీస్‌గఢ్‌ కూడా ఆ జాబితాలో చేరింది. ప్రస్తుతం పంజాబ్,ఇటు చత్తీస్ గఢ్ లో తీవ్రతరమైన అంతర్గత కుమ్ములాటలతో కాంగ్రెస్ సతమతమవుతోంది.

పంజాబ్‌లో రాజకీయం అంతా నవజోత్ సింగ్ సిద్దూ చుట్టే తిరుగుతోండగా…చత్తీస్ గఢ్ లో సీఎం భూపేశ్‌ బఘేల్‌, ఆరోగ్యశాఖ మంత్రి టీఎస్‌ సింగ్‌ డియో మధ్య ముఖ్యమంత్రి పీఠం కోసం కోల్డ్ వార్ నడుస్తోంది. ఇప్పటికే ఎవరి వాదన వారు వినిపించేందుకు ఇరువురు నాయకులు దిల్లీకి చేరుకుని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో కూడా సమావేశమయ్యారు.

అసలు పంజాబ్ లో ఏం జరుగుతోంది

సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్‌కు, నవజోత్ సింగ్ సిద్దూకు మధ్య ఏర్పడిన అగాథాన్ని పూడ్చడానికి కాంగ్రెస్ అధిష్టానం… ప్రత్యేక భేటీలు నిర్వహించి చివరికి గత నెలలో పంజాబ్ పీసీసీ చీఫ్ పదవిని ఇచ్చి సిద్దూను శాంతింపజేసింది. సిద్ధూ ప్రమాణస్వీకారానికి సీఎం అమరీందర్ కూడా హాజరై అందరినీ ఆశ్చర్యపరిచారు. అయితే పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవజోత్ సింగ్ సిద్ధూ కొత్తగా నియమించుకున్న సలహాదారులు మల్వీందర్ సింగ్ మాలి, ప్యారేలాల్ గార్గ్ ఇటీవల కాశ్మీర్, పాకిస్తాన్ లాంటి సున్నితమైన జాతీయ సమస్యలపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు పార్టీ యూనిట్‌లో మళ్లీ కలకలాన్ని రేపింది.

సిద్ధూ సలహాదారులు ఏమన్నారు
పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవజోత్ సింగ్ సిద్ధూ కొత్తగా ఇద్దరు సలహాదారులు మల్వీందర్ సింగ్ మాలి, ప్యారేలాల్ గార్గ్ లను నియమించుకున్నారు. కశ్మీర్ ఒక ప్రత్యేక దేశం అని, భారతదేశం, పాకిస్తాన్ రెండూ దాని చట్టవిరుద్ధమైన నివాసితులే అని సిద్ధూ సలహాదారు మల్వీందర్ సింగ్ మాలి ఇటీవల వ్యాఖ్యానించారు. కాశ్మీర్ ని భారత-పాకిస్తాన్ దేశాలు అక్రమంగా ఆక్రమించుకున్నాయని, నిజానికది ప్రత్యేక దేశమని..ముఖ్యంగా ఇండియా దాన్ని గుర్తించాలని మల్వీందర్ సింగ్ ఇటీవల తన ఫేస్ బుక్ లో పోస్టులు పెట్టారు. పైగా దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ స్కెచ్ నొకదానిని అయన గత జూన్ లోనే పోస్ట్ చేసి మరో వివాదం రేపారు. అది 1989 నాటి పంజాబ్ మ్యాగజైన్ ముఖచిత్రంగా ప్రచురింపబడింది. అంతేకాదు.. హిందువులు, సిక్కులను రక్షించే బాధ్యత తాలిబన్లదేనని, వారి పాలనలో అఫ్ఘానిస్తాన్ బాగానే ఉంటుందని కూడా ఆయన పేర్కొన్నాడు. సిద్ధూ మరొక సలహాదారు, ప్యారే లాల్ గార్గ్ పాకిస్తాన్‌పై కెప్టెన్ సింగ్ విమర్శలను ప్రశ్నించారు. పాకిస్తాన్ పట్ల సీఎం అమరేందర్ సింగ్ తన అభిప్రాయాలను మార్చుకోవాలంటూ ప్యారేలాల్ గార్గి వ్యాఖ్యానించారు.

సీఎం అమరీందర్ ఆగ్రహం-ఎవ్వరినీ వదిలిపెట్టనని హెచ్చరించిన సిద్ధూ
సిద్ధూ ఇద్దరు సలహాదారులు చేసిన “దారుణమైన, అనాలోచితమైన” వ్యాఖ్యలతో ముఖ్యమంత్రి కలత చెందారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సిద్దూ సలహాదారులకు “పంజాబ్ కాంగ్రెస్ చీఫ్‌కు సలహాలివ్వడమే వారి పని అని, తమకు పూర్తిగా తెలియని విషయాలపై వారుమాట్లాడవద్దని వారిని కోరారు. పాకిస్తాన్ పట్ల సీఎం అమరేందర్ సింగ్ తన అభిప్రాయాలను మార్చుకోవాలంటూ ప్యారేలాల్ గార్గి చేసిన వ్యాఖ్య కూడా సింగ్ కి తీవ్ర ఆగ్రహం కలిగించిందని సమాచారం. వీరిద్దరినీ సిద్దు కంట్రోల్ చేయాలనీ ఆయన గట్టి వార్నింగ్ ఇచ్చారు. వీరు దేశ ప్రయోజనాలకు హాని కలిగేలా వ్యవహరిస్తున్నారని ఆయన సిద్దూకి రాసిన లేఖలో పేర్కొన్నారు.

తన సలహాదారుల వైఖరితో ఇరకాటంలో పడిన సిద్దు..వారికి సమన్లు జారీ చేశారు. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో పార్టీ గెలుపునకు సలహాదారులు తనకు సలహాలిస్తారని అనుకుంటే తమ వివాదాస్పద వ్యాఖ్యలతో మొదటికే మోసం తెచ్చేట్టు ఉన్నారని సిద్ధూ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఈసమయంలో ఈ సలహాదారులను పార్టీ అపాయింట్ చేయలేదని. వారిని సిద్ధూ డిస్మిస్ చేయాలని.. ఒకవేళ సిద్దూ వారిని డిస్మిస్ చేయకుంటే, తానే డిస్మిస్ చేస్తానని.. పార్టీని నవ్వులపాలు చేసే వారిని ఉంచుకోవాలని భావించట్లేదు అని ఏఐసీసీ పంజాబ్ ఇన్‌చార్జ్ హరీశ్ రావత్ వ్యాఖ్యానించారు. ఇక,కాంగ్రెస్ హైకమాండ్ కూడా సిద్ధూ నలుగురు సలహాదారులలో..వివాదాస్పద వ్యాఖ్యలను చేసిన ఇద్దరిని తొలగించాలని సిద్ధూని ఆదేశించింది. ఈ సమయంలో సిద్ధూ సలహాదారుడు మల్వీందర్ సింగ్ మాలి తన పదవికి రాజీనామా చేశారు.

ఇక,ఐసీసీ పంజాబ్ ఇన్‌చార్జ్ హరీశ్ రావత్ చేసిన వ్యాఖ్యలపై సిద్దూ తీవ్రంగా స్పందించారు. తనను నిర్ణయం తీసుకోనివ్వాలని లేదంటే ఎవ్వరినీ వదిలిపెట్టనని హెచ్చరించారు. నిర్ణయం తీసుకోవడానికి అనుమతించాలని హైకమాండ్‌ను అడిగాను. కనీసం మరో రెండు దశాబ్దాలు కాంగ్రెస్ రాష్ట్రంలో జవసత్వాలతో కొనసాగేలా పనిచేస్తాను. లేదంటేనా.. ఎవ్వరినీ వదిలిపెట్టను అని సిద్ధూ అన్నారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పంజాబ్ ఇన్‌చార్జీ హరీశ్ రావత్ స్పందన కోరగా మీడియా ప్రచారాలను ఆధారంగా చేసుకుని నేను ఆయనను ప్రశ్నించను. ఆయన ఏ నేపథ్యంలో అలాంటి వ్యాఖ్యలు చేశాడో చూస్తాను. ఆయనే పార్టీ రాష్ట్ర యూనిట్ చీఫ్. ఆయన కాకుండా ఇంకెవరు నిర్ణయాలు తీసుకుంటారు మరి అని అన్నారు.

ఢిల్లీకి చేరిన చత్తీస్ గఢ్ కాంగ్రెస్ రాజకీయం

చత్తీస్ గఢ్ సీఎంగా భూపేశ్‌ బఘేల్‌,, ఆరోగ్యశాఖ మంత్రి టీఎస్‌ సింగ్‌ డియో మధ్య ముఖ్యమంత్రి పీఠం కోసం కోల్డ్ వార్ నడుస్తోంది. ఛత్తీస్‌గఢ్‌లో 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాల్లో గెలిచి కాంగ్రెస్‌ అధికారాన్ని కైవసం చేసుకుంది. అయితే ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎన్నుకోవడం కాంగ్రెస్ కు తలనొప్పిగా మారింది. ఓవైపు భూపేశ్ బఘేల్‌, మరోవైపు సీనియర్‌ నేత టీఎస్‌ సింగ్‌ డియో వర్గాల నుంచి ఒత్తిడి పెరిగింది. చివరకు రొటేషనల్‌ ఫార్ములాలో ఇద్దరినీ సీఎంగా చేసేందుకు అధిష్ఠానం అంగీకరించింది. తొలి రెండున్నర ఏళ్లు భూపేశ్‌ బఘేల్‌ను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాలని సూచించింది. అందుకు అనుగుణంగానే అధికార పగ్గాలు చేపట్టిన భూపేశ్‌ బఘేల్‌.. ఈ ఏడాది జూన్‌ 17 నాటికి రెండున్నరేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకున్నారు. దీంతో ముందస్తుగా అనుకున్న ప్రకారం, డియోకు సీఎం బాధ్యతలు అప్పజెప్పాలని ఆయన వర్గం నుంచి ఒత్తిడి ఎక్కువ కావడంతో కాంగ్రెస్‌ పార్టీలో విభేదాలు మొదలయ్యాయి.

రాహుల్ ని కలిసిన అనంతరం భూపేశ్ బఘేల్‌
హైకమాండ్ దగ్గర తన బలాన్ని నిరూపించుకునేందుకు బఘేల్.. తనకు మద్దతిచ్చే ఎమ్మెల్యేలు, మంత్రులతో కలిసి ఢిల్లీ వెళ్లారు. ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని భూపేశ్ బఘేల్‌ కలిశారు. సుమారు మూడు గంటల పాటు రాహుల్- భూపేశ్ బఘేల్‌ చర్చలు జరిపారు. రాహుల్ తో సుదీర్ఘ మంతనాల అనంతరం మీడియాతో మాట్లాడిన భూపేశ్ బఘేల్‌..నేను చెప్పాలనుకున్నదంతా రాహుల్ కి చెప్పాను. నా మనసులోని మాటలను రాహుల్ తో పంచుకున్నా. చత్తీస్ గఢ్ వచ్చి స్వయంగా పరిస్థితిని సమీక్షించాలని రాహుల్ ని కోరాను. వచ్చే వారం చత్తీస్ గఢ్ వచ్చేందుకు రాహుల్ అంగీకరించారు. చత్తీస్ గఢ్ లో రొటేషన్ ఫార్ములా లాంటిది ఏమీ లేదని..తనకు 70మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని భూపేశ్ బఘేల్‌ తెలిపారు. ఛత్తీస్ గఢ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం భద్రంగా ఉందని.. సీఎం మార్పు లేదని తేల్చి చెప్పారు భూపేశ్ బఘేల్‌. పార్టీ అధిష్ఠానాన్ని కలవాలని తనకు సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ నుంచి సందేశం వచ్చిందని బఘేల్ అన్నారు.