Punjab CM Bhagwant Mann
Punjab Govt : పంజాబ్ ప్రభుత్వం ఉద్యోగుల పనివేళల్లో మార్పులు చేసింది. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు ఇక నుంచి ఉదయం 7.30 నుంచి మ.2 గంటల వరకే పనిచేయాలని నిర్ణయించింది పంజాబ్ లోని ఆప్ ప్రభుత్వం. విద్యుత్ ఆదా కోసం సీఎం భగవంత్ సింగ్ మాన్ ప్రభుత్వం ఇటువంటి నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం పంజాబ్ లో ప్రభుత్వ కార్యాలయ పనివేళలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంది. ఈ పనివేళల సమయాలు మార్పుతో ఇక నుంచి అంటే మే 2 (2023) నుంచి అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోను ఉదయం 7.30 గంటలకు ప్రారంభమై, మధ్యాహ్నం 2 గంటలకు ముగిసేలా నిర్ణయించామని సీఎం భగవంత్ తెలిపారు. ఈ కొత్త పనివేళలు జులై 15 వరకు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు.
ఈ పనివేళల మార్పులు కేవలం ఉద్యోగులకే కాకుండా మంత్రుల నుంచి సీఎం వరకు నిర్ణయించిన సమయంలోనే ఆఫీసులకు రావాల్సి ఉంటుంది.దీంతో సీఎం భగవంత్ మాన్, ఆర్థిక మరియు పన్నుల శాఖ మంత్రి హర్పాల్ సింగ్ చీమాతో పాటు పలువురు మంత్రులు ఉదయం 7.30గంటలకే వారి వారి కార్యాలయాలకు చేరుకున్నారు.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు చాలా మందితో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని సీఎం తెలిపారు. వేసవిలో కరెంట్ వాడకం ఎక్కువగా పెరగడం వల్లే పనివేళలు మార్పులు చేశామని తెలిపారు. ముఖ్యంగా మధ్యాహ్నం 1.30 గంటల తర్వాత విద్యుత్ వినియోగి బాగా పెరిగిందని దీంతో ప్రభుత్వ కార్యాలయాలు మధ్యాహ్నం 2 గంటలకే మూసివేస్తే విద్యుత్ వినియోగాన్ని తగ్గించినట్లు అవుతుందని తెలిపారు. ఈ మార్పుల వల్ల విద్యుత్ లోడ్ గరిష్ఠ స్థాయిని 350 మెగావాట్ల నుంచి 300 వరకు తగ్గించవచ్చని స్పష్టం చేశారు.
ఈ నిర్ణయంతో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఉదయం 7.30 గంటలకే ప్రారంభమవతుతాయని వారితో పాటు మంత్రులు కూడా ఆయా సమయాల్లోనే వారి పనులు ముగించుకోవాలనితెలిపారు. అలాగే తాను కూడా ఉదయం 7.30గంటలకే కార్యాలయానికి చేరుకుంటానని సీఎం తెలిపారు. కాగా విద్యుత్ వినియోగాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వ కార్యాలయాల పనివేళ్లలో మార్పులు చేస్తామని గత నెలలోనే సీఎం భగవంత్ మాన్ ప్రకటించారు. ప్రకటించినట్లుగానే అమలు చేయటానికి ఈ మార్పులను ప్రకటించారు.