ఓ 20ఏళ్ల వ్యక్తి CAAకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నందుకు తోసి కిందపడేయడమే కాకుండా కుర్చీలతో కొట్టారు. ఆందోళనల్లో ఇది అంత పెద్ద విషయమేమీ కాకపోయినా జరిగింది హోం మంత్రి అమిత్ షా సమక్షంలో కావడం గమనార్హం. ‘జనాల్లో నుంచి వెనక్కు లాగేసి గ్రౌండ్ లో పడేశారు. కుర్చీలు విసిరేసి నన్ను కొట్టారు’ అని ఢిల్లీ పోలీసులకు బాధితుడు లెటర్ ద్వారా కంప్లైంట్ చేశాడు. పోలీసులు అతని మానసిక పరిస్థితి బాలేదని చెబుతున్నారు.
హర్జీత్ సింగ్ అనే వ్యక్తి గుంపులో ఉండి ‘సీఏఏ వాపస్ లో’ (సీఏఏను వెనక్కి తీసుకోండి) అంటూ అమిత్ షాను అడ్రస్ చేస్తూ నినాదాలు చేశాడు. దీంతో ఢిల్లీ పోలీసులు ఏ నేరం చేయకపోయినప్పటికీ తీసుకెళ్లి లాకప్ లో వేశారు.
‘ఏ కారణంతో నన్ను అదుపులోకి తీసుకున్నారో కూడా చెప్పలేదు. బలవంతంగా నా మానసిక పరిస్థితి బాలేదని పోలీసులు లెటర్ రాయించారు. అలా రాయకపోతే నన్ను విడిచిపెట్టేది లేదని హెచ్చరించారు’ అని ఆరోపించాడు. దీనిపై డీసీపీ వేద్ ప్రకాశ్ సూర్య మాట్లాడుతూ.. అతని నుంచి ఎటువంటి లెటర్ తీసుకోలేదు. అతణ్ని దాడి నుంచి కాపాడి హాస్పిటల్ లో చేర్పించాం. రిపోర్టులు వచ్చిన తర్వాత వివరాలు అడిగి పేరెంట్స్ కు అప్పజెప్పాం’ అని తెలిపాడు.
ఢిల్లీ యూనివర్సిటీలో చెందిన హర్జీత్ సింగ్ బీఏ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఏ హాస్పిటల్ కు తీసుకెళ్లలేదని నేరుగా పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారని సింగ్ ఆరోపిస్తున్నాడు. ఈ ఘటనకు ముందు అతను వేసుకున్న టీ షర్ట్ తర్వాత చినిగిపోయి ఉన్న సంగతిని మీడియాకు చూపించారు.
‘శీలంపూర్‌లో సీఏఏ ఆందోళనలో పాల్గొనేందుకు వెళ్తున్నా. ఆ సమయంలో బాబర్‌పూర్‌లో భారీగా పోలీసులు మోహరించి ఉండటం గమనించా. షా వస్తున్నారని అందుకే ఈ ఏర్పాట్లు అని తెలిసింది. అతను వచ్చేంత వరకూ ఆగి ఆందోళన చేయడానికి ఇదే సరైన సమయమని భావించా. ‘హమ్ డర్తే నహీ. హమేన్ అప్నే ఆవాజ్ రఖ్నే కా హక్ హై’ (మేం భయపడం, మా గొంతు వినిపించే హక్కు మాకూ ఉంది’ అని అన్నాడు.
ఇంకా నినాదాలు చేస్తున్నప్పుడు అమిత్ షా నుంచి ఇలా మాటలు వినిపించాయని చెప్పాడు. ‘అరే యార్ లే లో ఇస్కో, సెక్యూరిటీ వాలే లే జావో ఇస్కో.. ఉస్ లడ్కే కో జరా సలామత్ లే జాయేన్ ఆప్. జల్దీ బహార్ లే జావో ఉస్కో’ (సెక్యూరిటీ ఎవరైనా ఇతణ్నీ తీసుకెళ్లండి. ఈ పిల్లాడ్ని కొంచెం చూసుకోండి. త్వరగా బయటకు తీసుకెళ్లండి) అని అన్నారని వెల్లడించాడు.