Rahul Gandhi : నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు.. మోదీకి కూడా తెలుసు.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు!
Rahul Gandhi : ప్రధాని మోదీ తన ఫోన్‌ను ట్యాప్ చేయిస్తున్నారంటూ రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. తన మొబైల్‌లోనే ఆధారాలున్నాయని చెబుతూ బహిరంగ చర్చకు సవాల్ విసిరారు. పూర్తి వివరాలివే..
- Sreehari A
- Published on- November 13, 2026 / 04:53 PM IST
Rahul Gandhi Alleges Phone Tapping
- నా మొబైల్‌లోనే ఆధారాలున్నాయి..
- ప్రధానికి రాహుల్ గాంధీ సవాల్
- నా ఫోన్ చూపిస్తా.. మోదీతో చర్చకు సిద్ధమా?
- ఫోన్ ట్యాపింగ్ నుంచి పెగాసస్ వరకు..
Rahul Gandhi : దేశ రాజకీయాల్లో మరోసారి ఫోన్ ట్యాపింగ్ అంశం హాట్ టాపిక్‌గా మారింది. ప్రధాని నరేంద్ర మోదీ తన మొబైల్‌ను ట్యాప్ చేయిస్తున్నారంటూ లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. తన ఫోన్‌లోనే ఇందుకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయని చెబుతూ.. మొబైల్‌ను పైకి చూపించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది..
ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో నిర్వహించిన ‘ఆస్క్ మీ’ ఇంటరాక్టివ్ సెషన్‌లో రాహుల్ గాంధీ నెటిజన్లతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పలువురు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. తన ఫోన్ ట్యాపింగ్‌కు గురవుతోందని, ఈ విషయం ప్రధానికి కూడా తెలుసని వ్యాఖ్యానించారు. అయితే, తన ఆరోపణలకు సంబంధించి ఎలాంటి సాంకేతిక ఆధారాలను మాత్రం ఈ కార్యక్రమంలో రాహుల్ బయటపెట్టలేదు.
Read Also : RAC టికెట్లపై రైల్వే శాఖ సంచలనం.. ఇక నుంచి..
ప్రధాని మోదీకి మరోసారి సవాల్..
ఇదే సమయంలో ప్రధాని మోదీకి మరోసారి రాహుల్ గాంధీ సవాల్ విసిరారు. దేశంలో జరుగుతున్న పరిణామాలు, ఎన్నికల ప్రక్రియ, విదేశీ జోక్యం, జాతీయ భద్రత వంటి అంశాలపై తనతో నేరుగా బహిరంగ చర్చకు రావాలని డిమాండ్ చేశారు. ముఖాముఖి చర్చ జరిగితే ఎవరు దేశానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు? ఎవరు విదేశీ శక్తుల ప్రభావంలో ఉన్నారనే విషయాలు బయటపడతాయని అన్నారు..
రాహుల్ ఆరోపణలను ఖండించిన కేంద్రం :
నిజానికి ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు రాహుల్‌కు కొత్తేమీ కాదు. 2023లోనూ పెగాసస్ స్పైవేర్ అంశాన్ని లేవనెత్తారు. తనతో పాటు పలువురు ప్రతిపక్ష నేతల ఫోన్లలో పెగాసస్ ఉందని, తమ సంభాషణలను రికార్డు చేస్తున్నారంటూ ఆరోపించారు. ఇంటెలిజెన్స్ అధికారులు ఫోన్‌లో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారని కూడా అప్పట్లో చెప్పారు..
అయితే, ఈ ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం గతంలోనే తీవ్రంగా ఖండించింది. ఇప్పుడు మరోసారి అదే అంశాన్ని తెరపైకి తీసుకురావడంతో రాజకీయంగా చర్చ మొదలైంది. రాహుల్ ఆరోపణలకు కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఆధారాలు బయటపడతాయా? లేక ఇది రాజకీయ విమర్శలకే పరిమితమవుతుందా? అన్నది ఆసక్తికరంగా మారింది..
