Rahul Gandhi
Karnataka elections 2023: కర్ణాటకలోని బీజేపీ సర్కారుపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తీవ్ర విమర్శలు గుప్పించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల (Karnataka elections 2023)లో కాంగ్రెస్ తరఫున ప్రచారంలో పాల్గొన్న రాహుల్ గాంధీ అనెకల్ లో ఈ సందర్భంగా మాట్లాడారు.
“కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వంలో ఎన్నో కుంభకోణాలు చూస్తున్నాం. ఎమ్మెల్యే కుమారుడు 8 కోట్ల రూపాయలతో పట్టుబడ్డారు. రూ.2,500 కోట్లతో సీఎం కుర్చీనే కొనేయొచ్చని ఓ బీజేపీ ఎమ్మెల్యే అంటున్నారు. కర్ణాటకలో జరిగిన అవినీతి గురించి ఆరేళ్ల పిల్లాడినడిగినా చెబుతాడు. కర్ణాటకలో గత మూడేళ్లుగా బీజేపీ సర్కారు ఉంది.
రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి గురించి ప్రధాని మోదీకి కూడా తెలుసు. డబుల్ ఇంజన్ ను చోరీ చేశారని అంటున్నారు. కాబట్టి మోదీజీ ఓ విషయం చెప్పాలి.. ఆ 40 శాతం కమిషన్ లో ఏ ఇంజన్ కు ఎంత దక్కింది?” అని రాహుల్ ప్రశ్నించారు. కేంద్రంతో పాటు రాష్ట్రంలోనూ బీజేపీ సర్కారు ఉంటే దాన్ని డబుల్ ఇంజన్ సర్కారుగా ఆ పార్టీ పిలుస్తోంది.
ఓ ప్రాజెక్టు విషయంలో కర్ణాటక ప్రభుత్వం 40 శాతం కమీషన్ అడిగిందని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. దీన్నే కాంగ్రెస్ పార్టీ ప్రచారాస్త్రంగా తీసుకుంది. మణిపూర్ లో జరుగుతున్న హింస గురించి రాహుల్ గాంధీ మాట్లాడుతూ… “విద్వేషపూరిత రాజకీయాల వల్లే మణిపూర్ లో అటువంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. మేము విద్వేషపూరిత రాజకీయాలకు వ్యతిరేకంగానే భారత్ జోడో యాత్ర చేశాం” అని అన్నారు.