ఆర్దికవ్యవస్థ నేల చూపు చూస్తోందన్న నివేదికల మధ్య మోడీ ప్రభుత్వానికి మరో ఇబ్బంది. సోమవారం పార్లమెంట్ ముందుంచిన కాగ్ నివేదిక, రైల్వేల పరువు తీసేసింది. పదేళ్లలోనే అతి తక్కువ అపరేషన్ రేషియోను రైల్వే నమోదుచేసింది. వంద రూపాయిల ఆదాయానికి చేసిన ఖర్చు రూ.98.44. ప్రతి వందకు వచ్చిన లాభం రూ.1.56. ఇంత పెద్ద రైల్వే వ్యవస్థకి మిగులు రూ.1, 665 కోట్లు. ఈ లెక్కన గుత్తాధిపత్యమున్న రైల్వే చాలా దారుణంగా పనిచేసినట్లు లెక్క.
నిజానికి కిందటి ఏడాదే కాగ్ నివేదిక వంద ఆదాయానికి ఇండియన్ రైల్వేస్ చేస్తున్న ఖర్చు రూ.96.5గా తేల్చింది. 2000-2001 ఆర్దిక సవంత్సరంతో పోలిస్తే ఇదే తక్కువ. ఇప్పుడు పరిస్థితి మరింత దిగజారింది. బొగ్గు రవాణా కోసం ఎన్.టి.పి.పి. లాంటి సంస్థల నుంచి అడ్వాన్స్‌లు రాకపోయి ఉంటే… ఈ లాభం కాస్తా హరీ మనేది. రైల్వేలను నష్టాల్లో చూపించాల్సి వచ్చింది. ప్రభుత్వానికి ఇది మరీ ఇబ్బంది. అంటే 5, 676 కోట్ల మేర నష్టం చూపించాల్సి వచ్చేది. అంటే రూ.100 ఆదాయానికి చేసిన ఖర్చు రూ.102.66.
లాభాల కూతపెట్టే రైల్వేస్‌కు ఏమైంది?
రైల్వేలకు లాభాలు ఎందుకు తగ్గిపోతున్నాయి? రైల్వే ప్రయాణాలు ఎక్కువగా చేసేవారికి తెలిసిన నిజాలనే కాగ్ కూడా పార్లమెంట్ కు చెప్పింది. 2016లో సీనియర్ సిటిజన్స్ కోసం ‘గివ్ ఇట్ అప్’ పథకాన్ని ప్రారంభించారు. దీని ప్రకారం సీనియర్ సిటిజన్స్ కు తగ్గింపు ధరలకే టిక్కెట్లు ఇస్తారు. సీనియర్ సిటిజన్స్ వాడుకొంది సగం కన్నా ఎక్కువ. పథకం ప్రారంభం నుంచి 2018 మార్చి వరకు రైల్వేలు ఈ పథకం వల్ల ఆదా చేసుకుంది 77 కోట్లే. ప్రయాణీకులు కొనే ప్రతి టిక్కెట్ కు ఎంతో కొంత సబ్సిడీ ఉంటుంది. అందువల్ల ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువగానే కనిపిస్తుంది. దీనికితోడు 2016 నుంచి సబ్సిడీలు పెరగడమే తప్ప తగ్గడంలేదు. 2016లో ప్రయాణీకుల టిక్కెట్ ఖర్చులో చెల్లించింది 53 శాతమే. అంటే 47 శాతం మేర రైల్వేల మీద అదనపు భారం పడుతోంది. దీనివల్ల ఏడాదికి 34వేల కోట్ల మేర ఆదాయాన్ని కోల్పోతోంది రైల్వే.
నిర్వహణ వ్యయాన్ని తగ్గించుకోవాలని ఎంతగా ప్రయత్నిస్తున్నా అనుకున్నంతగా సఫలం కాలేకపోతోంది రైల్వే. దీనికితోడు జీతాలు. ఎక్కువ మంది సిబ్బంది. కాంట్రాక్టర్లకు ఎక్కువగా చెల్లించడం. ఇలా చాలా కారణాలే ఉన్నాయి.