Ram Temple Donation Case : రాములోరి డబ్బులు అడ్డంగా కొట్టేసి.. 15వేల జీతగాడు ఎన్ని ఆస్తులు కూడబెట్టాడో చూడండి..
Ram Temple Donation Case : అనుకల్ప్ మిశ్రా వద్ద ఓ వాహనం ఉన్నప్పటికీ.. అరెస్టుకు కొద్దిరోజుల ముందు మహీంద్రా స్కార్పియో ఎస్‌యూవీ బుక్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా రూ.1లక్షకుపైగా విలువైన బైక్‌ను కూడా కొనుగోలు చేసినట్లు సమాచారం.
- Harish Thanniru
- Published on- June 29, 2026 / 01:13 PM IST
Ram Temple donation case
Ram Temple Donation Case : అయోధ్య రామాలయానికి భక్తులు సమర్పించిన విరాళాల దుర్వినియోగం కేసులో పోలీసులు ఎనిమిది మందిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇందులో ఒకే కుటుంబానికి చెందిన అనుకల్ప్ మిశ్రా, అతని బావ లవకుష్ మిశ్రా ఉన్నారు. అనుకల్ప్ మిశ్రానే ప్రధాన సూత్రధారిగా పోలీసులు భావిస్తున్నారు. తాజాగా అయోధ్య పరిసరాల్లోని ఆయన గ్రామాన్ని సందర్శించగా ఆసక్తికర విషయాలు వెలుగులోకివ చ్చాయి.
అనుకల్ప్ మిశ్రా ఆస్తులపై ఉత్తరప్రదేశ్ పోలీసులు విస్తృత దర్యాప్తు చేపట్టారు. నెలకు కేవలం రూ.15వేల జీతం పొందుతున్న 22ఏళ్ల యువకుడి పేరిట భారీ విలువైన ఆస్తులు ఉండటం అధికారులను ఆశ్చర్యానికి గురిచేసింది. దర్యాప్తులో భాగంగా అనుకల్ప్ మిశ్రా గత ఏడాది అయోధ్యలో కొనుగోలు చేసిన ఇంటికి ప్రస్తుత మార్కెట్ విలువ రూ.65లక్షలుగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అలాగే అతని స్వగ్రామమైన బసావా శివారులో ఇటీవల నిర్మించిన ఫామ్ హౌస్ పై కూడా విచారణ సాగుతోంది.
అనుకల్ప్ మిశ్రా వద్ద ఓ వాహనం ఉన్నప్పటికీ.. అరెస్టుకు కొద్దిరోజుల ముందు మహీంద్రా స్కార్పియో ఎస్‌యూవీ బుక్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా రూ.1లక్షకుపైగా విలువైన బైక్‌ను కూడా కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ ఆస్తులన్నింటికీ ఉపయోగించిన నిధులు ఎక్కడి నుంచి వచ్చాయనే విషయాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. ఈనెల 28న అనుకల్ప్ నివాసంలో నిర్వహించిన సోదాల్లో స్వాధీనం చేసుకున్న ఆస్తుల పత్రాలు, బ్యాంకు రికార్డులు, ఇతర ఆర్థిక పత్రాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ ఆస్తులు అతని చట్టబద్దమైన ఆదాయంతోనే వచ్చాయా? లేకుంటే ఆలయ భక్తుల విరాళాల దుర్వినియోగంతో కొనుగోలు చేసినవా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.
ఈ ఏడాది ఏప్రిల్ నెలలో తన గ్రామంలో అనుకల్ప్ మిశ్రా ఏడు రోజులపాటు భారీ స్థాయిలో ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహించినట్లు తెలిసింది. ఈ కార్యక్రమంకు సంబంధించి పోలీసులు విచారణ చేయగా.. పలువురు ప్రముఖులు హాజరైనట్లు గుర్తించారు. మరోవైపు.. స్థానికులు ఇచ్చిన సమాచారం ప్రకారం.. గత కొన్నేళ్లలో అనుకల్ప్ కుటుంబ ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడినట్లు తెలిసింది. అయితే, ఈ వివరాలను ప్రస్తుతం పోలీసులు కేవలం దర్యాప్తునకు సంబంధించిన ప్రాథమిక సమాచారంగానే పరిగణిస్తున్నారు.
ఇప్పటికే అరెస్టైన మిగతా నిందితుల చర, స్థిరాస్తులు, బ్యాంకు ఖాతాలు, పెట్టుబడులు, బీమా పాలసీలు, లాకర్లు, ఆదాయపు పన్ను రిటర్నులు కూడా పోలీసులు పరిశీలించనున్నారు. ఆదాయానికి మించి అక్రమంగా ఆస్తులు కూడబెట్టారా అనే అంశంపై ఆర్థిక లావాదేవీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
