Row Over Kiren Rijiju's Arunachal Tweet
Indian-China Clash: అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ ప్రాంతంలో చైనా మూకలు చొరబాటుకు ప్రయత్నించడంతో ఇరు దేశాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ విషయమై అధికార-విపక్షాల మధ్య రాజకీయ యుద్ధమే కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు చేసిన ట్వీట్ ఒకటి వివాదాస్పదంగా మారింది. సైనికులతో పాటు ఉన్న ఫొటోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు రిజిజు. అయితే అది ఇప్పటి ఫొటోనేనా అనుమానాలు లేస్తున్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీ అయితే అది మూడేళ్ల క్రితం నాటి ఫొటో అంటూ విమర్శలు గుప్పిస్తోంది.
Indian-China Clash: పీఎం కేర్స్‌కు చైనా నుంచి నిధులు? ప్రధాని మోదీకి కాంగ్రెస్ 7 ప్రశ్నలు
వాస్తవానికి రాహుల్ గాంధీ వ్యాఖ్యల నేపథ్యంలో రిజిజు ఈ ట్వీట్ చేశారు. చైనా యుద్ధానికి సిద్ధమవుతుంటే మోదీ ప్రభుత్వం నిద్రపోతోదంటూ రాహుల్ వ్యాఖ్యానించారు. ఇది కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి చాలా ఆగ్రహాన్ని తెప్పించింది. ఇంకేముంది, ఆ పార్టీ నేతలంతా కలిసి రాహుల్ గాంధీపై కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడుతున్నారు. రాహుల్ ముత్తాత, దేశ మొదటి ప్రధానమంత్రి జవహార్‌లాల్ నెహ్రూ నుంచి నేటి గాంధీ కుటుంబం వరకు ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు.
SAME picture was put out 3 years ago if I recall https://t.co/E35mhEVmkd
— Jairam Ramesh (@Jairam_Ramesh) December 17, 2022
ఇక ఇదే కోవలో రాహుల్ గాంధీకి కౌంటర్‌గా సైనికులతో ఉన్న ఫొటోను తన ట్విట్టర్ ఖాతాలో రిజిజు షేర్ చేశారు. ‘‘అరుణాచల్ స్కౌట్స్ అనేది ఇండియన్ ఆర్మీకి చెందిన పదాతి దళం. ఇది అరుణాచల్ ప్రదేశ్‌లోని చైనాతో భారతదేశ సరిహద్దును కాపాడుతోంది. పర్వత ప్రాంతంలో జరిగే యుద్ధాల్లో ప్రత్యేకత కలిగి ఉన్న దళం ఇది. దీపావళి శుభ సందర్భంగా వారితో కలిసి ఉండటం సంతోషంగా ఉంది’’ అని రిజిజు ట్వీట్ చేశారు. అయితే అది ఏ ఏడాదిలోని దీపావళి అనేది ఆయన స్పష్టం చేయలేదు.
ఇక ఈ ఫొటోపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది. 2019లో సందర్శించినప్పటి ఫొటోను ఇప్పుడు షేర్ చేశారంటూ కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ఆరోపించారు. వాస్తవానికి ఈ ఫొటోను స్వయంగా రిజిజునే మూడేళ్ల క్రితం చేశారని, దేశ భద్రతకు సంబంధించిన అంశాల్లో ప్రజలను ఇలా తప్పుదోవ పట్టించడం సమంజసం కాదని ఆయన అన్నారు. కాంగ్రెస్ సహా మరికొంత మంది సైతం ఈ ఫొటోపై తమ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే కొంతమంది మాత్రం ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. ఫొటో ఎప్పటిదైతేనేమి.. భద్రత సరిగా ఉంటే సరిపోతుంది కదా అని అంటున్నారు.