ఎలా వచ్చాయి ? ఎవరు వేశారు ? ఎందుకు వేశారు ? ఇవేవీ తెలియదు. ఓ మహిళ అకౌంట్లో రూ. 30 కోట్లు జమ కావడం హాట్ టాపిక్ అయ్యింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వార్త హల్ చల్ చేస్తోంది. నిజాయితీగా తన అకౌంట్లో కోట్ల రూపాయల డబ్బులు వచ్చాయని, దీనిపై చర్యలు తీసుకోవాలని ఆ మహిళ పోలీసులకు కంప్లయింట్ చేసింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు, బ్యాంకు అధికారులు సదరు మహిళ ఖాతాను క్లోజ్ చేసి..దర్యాప్తు చేపడుతున్నారు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకుంది.
బుర్హాన్ అలియాస్ ఇమ్రాన్…రీహానా బాను దంపతులు చెన్నపట్నంలో నివాసం ఉంటున్నారు. వీరు పూల వ్యాపారం చేసుకుంటూ జీవనం గడుపుతున్నారు. డిసెంబర్ 02వ తేదీ రీహానా అకౌంట్‌లో రూ. 30 కోట్లు జమ అయ్యాయని రీహానా గుర్తించారు. వెంటనే పోలీసులకు కంప్లయింట్ చేసింది. ఈ డబ్బు తనది కాదని..ప్రభుత్వానికి అప్పగించాలని కోరింది. కానీ ఫిర్యాదు చేసిన రెండు నెలలు అవుతున్నా..ఎలాంటి రెస్పాండ్ కాకపోవడంతో తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
ఏం జరిగింది ?
రీహానా బాను..జన్ ధన్ యోజన పథకం కింద జీరో బ్యాలెన్స్ కింద ఖాతాను SBIలో ఓపెన్ చేశారు. అయితే..డిసెంబర్ 02వ తేదీన బ్యాంకు అకౌంట్లోకి భారీగా డబ్బు జమ కావడంతో బ్యాంకు అధికారి రెహానా ఇంటికి వచ్చారు. వెంటనే డబ్బును ఉపసంహరించుకోవాలని కోరారు. బ్యాంకుకు వెళ్లిన రీహానాకు మహిళా అధికారి మూడు ఫాంలు ఇచ్చి..పూర్తి చేసి సంతకం చేయాలని అన్నారు. దీనికి రీహానా నో చెప్పింది. దీంతో పోలీసులను పిలవాలని బ్యాంకు అధికారులు చెప్పారు. పోలీసులు అక్కడకు చేరుకున్నారు. అనంతరం రీహానాను విచారించారు.
ఇటీవలే తాను ఆన్ లైన్‌లో చీర కొనుగోలు చేయడం జరిగిందని, ఒక బహుమతిని గెలుచుకున్నారని..బీమాగా రూ. 6 లక్షలు జమ చేయాలని ఓ వ్యక్తి ఫోన్ చేసి చెప్పినట్లు రీహానా వెల్లడించారు. తాము పేదవారమని, వచ్చిన బహుమతి వద్దని, కొంత డబ్బు సహాయం చేయాలని తాము కోరినట్లు తెలిపారు. ఈ క్రమంలో..ఇమ్రాన్ ఏటీఎం ద్వారా బ్యాంకు ఖాతాను చెక్ చేయగా..భారీగా డబ్బు జమ అయ్యిందనే విషయాన్ని గుర్తించాడు. తమకు స్టేట్ మెంట్ ఇవ్వాలని బ్యాంకు అధికారులను కోరినా..ఇవ్వలేదని, బ్యాంకు ఖాతాను సీజ్ చేసినట్లు వెల్లడించారు. ఈ విషయంలో దర్యాప్తు చేయాలని పోలీసులను, ఐటీ అధికారులను కోరారు.
చివరగా..ఇమ్రాన్..రామ్ నగరలోని పోలీసు సూపరింటెండెంట్‌ను కలిశారు. కేసు నమోదు చేశాడు. తాము నిజాయితీగా వ్యవహరించామని, ఇద్దరు పిల్లలున్నారని, తనకు ఆరోగ్య సమస్యలున్నాయని, ఆర్థిక సహాయం చేయాలని ఇమ్రాన్ కోరాడు. తనకు రూ. 15 కోట్లు ఇచ్చి మిగతా డబ్బును తీసుకోవాలని విజ్ఞప్తి చేశాడు. అయితే..రీహానా అకౌంట్లో ఎవరు డబ్బులు వేశారనే దానిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.