ఢిల్లీ: మద్యం మహమ్మారికి బానిసలుగా మారి కూలిపోతున్న కుటుంబాలు ఎన్నో. మద్యం మత్తుతో జరుగుతున్న నేరాలు మరెన్నో. సమాజంలో పలు దారుణాలకు కారకంగా మారుతున్న ఈ మహమ్మారికి తెలిసీ తెలియని వయస్సులో అలవాటు పడిపోతున్నారు. భారతదేశంలో పెద్దవారితో పోటీపడి మరీ మైనర్లు మందుబాబులుగా మారిపోతున్నారని ఓ సర్వే వెల్లడించింది.
‘మద్యపానం ఆరోగ్యానికి హానికరం’ అని ఎంతగా అవగాహన కలిగించినా ఫలితం మాత్రం శూన్యం. ఈ క్రమంలో తల్లిదండ్రుల వైఫల్యమో.. స్నేహితుల ప్రోద్బలంతోనో.. లేదా తాగితే ఎలా ఉంటుందో అనే ఉత్సుకతతోనో స్కూల్ ఏజ్ నుంచే మద్యం తాగుతున్నారని ఈ సర్వే వెల్లడించింది.
ఢిల్లీ ఎయిమ్స్ ఆధ్వర్యంలో జరిపిన సర్వేలో ఈ భయంకరమైన వాస్తవాలు బయటికొచ్చాయి. భారతదేశంలోనే మైనర్లు అత్యధికంగా మద్యం సేవించే రాష్ట్రాల్లో పంజాబ్ మొదటి స్థానంలో ఉందని ఈ సర్వేలో తేలింది. పంజాబ్ లో 10 నుంచి 17 సంవత్సరాల వయసున్న దాదాపు 1.2 లక్షల మంది మద్యానికి అలవాటుపడ్డారని వెల్లడించింది. దీనికి కారణాలను మాత్రం సర్వే తెలుపలేదు. ఈ జాబితాలో పంజాబ్ తర్వాత పశ్చిమ బెంగాల్ రెండో స్థానంలోను..మహారాష్ట్ర మూడవ స్థానాల్లోను ఉన్నాయి.