సుప్రీం కోర్టు కేంద్రంతో పాటు 9రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది. కేంద్ర సమాచార శాఖ కమిషనర్(సీఐసీ), రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్(ఎస్‌ఐసీ) నియామకాలపై దాఖలైన పిటిషన్లపై బుధవారం విచారణ చేపట్టింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌తో పాటుగా మొత్తం తొమ్మిది రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. 4 వారాల్లో స్టేటస్ రిపోర్టు ఇవ్వాలని ఆదేశాలు జారీచేసింది.
జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇంకొన్ని రాష్ట్రాలు ఎస్‌ఐసీలను నియమించని విషయాన్ని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఖాళీగా ఉన్న సీఐసీ, ఎస్‌ఐసీ పోస్టుల భర్తీకి సుప్రీంకోర్టు ముందుగానే ఆదేశాలిచ్చింది. ఈ కమిషన్‌లో పదవులు ఖాళీ అయ్యే సమయానికి ఒకటి రెండు నెలల ముందే నియామకాల ప్రక్రియ ప్రారంభించాలని ఆదేశించింది.
ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎంపిక ప్రక్రియలో పాటించిన నిబంధనల ప్రకారం.. సీఐసీ, ఎస్‌ఐసీలో ఉన్న ఖాళీలను ఆరునెలల్లోగా భర్తీ చేయాలని సుప్రీంకోర్టు తెలిపింది. ఇప్పటి వరకు కొన్ని రాష్ట్రాలు మాత్రం నియామకాలు చేపట్టకుండా ఊరకుండిపోయాయి. సమాచార హక్కు చట్టం ప్రకారం కమిషనర్ల నియామకానికి అధికారులతో పాటు ఇతర రంగాలకు చెందిన ప్రముఖ వ్యక్తులను పరిగణనలోకి తీసుకోవాలి. ఇతర రంగాల వారిని పక్కకు పెట్టేయడంతో కార్యకర్తల్లో అభ్యంతరం వ్యక్తమవుతోంది.