K Vijay Kumar : కె.విజయ్ కుమార్.. సీనియర్ పోలీసు అధికారి. గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ ను అంతమొందించడంలో కీలకంగా వ్యవహరించిన ఈ పోలీస్ ఆఫీసర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. హోం మంత్రిత్వ శాఖ సీనియర్ భద్రతా సలహాదారు పదవికి ఆయన రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాల వల్ల పదవికి ఆయన రాజీనామా చేశారు.
ఢిల్లీలోని తన నివాసాన్ని ఖాళీ చేసి చెన్నైకి మకాం మార్చారు విజయ్ కుమార్. తన పదవీకాలం అంతా తనకు సహకరించినందుకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, హోం మంత్రిత్వ శాఖ అధికారులకు, అన్ని రాష్ట్రాల పోలీస్ బలగాలకు విజయ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.
జమ్మూ కశ్మీర్ లో ఉగ్రవాద సమస్యలతో పాటు మావోయిస్టులు, వామపక్ష తీవ్రవాద సమస్యలపై ప్రభుత్వానికి విజయ్ కుమార్ సలహాలు ఇస్తున్నారు. వీరిని అంతమొందించడంలో విజయ్ కుమార్ కీలకంగా వ్యవహరిస్తున్నారు. 1975 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన విజయ్ కుమార్ వివిధ హోదాల్లో, కీలక పదవుల్లో పనిచేశారు. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సీఆర్పీఎఫ్) డైరెక్టర్ జనరల్ గా 2012లో పదవీ విమరణ చేసిన తర్వాత హోం మంత్రిత్వ శాఖలో సీనియర్ సెక్యూరిటీ ఆఫీసర్ గా నియమితులయ్యారు.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.
2019లో హోం మంత్రిత్వ శాఖలో సీనియర్ సెక్యూరిటీ అడ్వైజర్ గా నియమితులయ్యే ముందు జమ్మూ కశ్మీర్ గవర్నర్ కు సలహాదారుగా కూడా పనిచేశారు విజయ్ కుమార్.
కర్ణాటక-తమిళనాడు ప్రభుత్వాలకు తలనొప్పిగా మారిన కరడుకట్టిన గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ ను హతమార్చడంలో కీలకంగా వ్యవహరించారు విజయ్ కుమార్. అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఎంతో నమ్మకంతో విజయ్ కుమార్ కు వీరప్పన్ బాధ్యతలను అప్పగించారు. తమిళనాడు లోని స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్టీఎఫ్) చీఫ్ గా పనిచేశారు. 2004లో పక్కా ప్రణాళికతో వీరప్పన్ ను హతమార్చింది విజయ్ కుమార్ నేతృత్వంలోని టీమ్.