Rewind 2025 : తొక్కిసలాటలు, పేలుళ్లు.. 2025లో దేశాన్ని కుదిపేసిన టాప్-5 పెను విషాదాలు..
అభిమానం పెను విషాదమే నింపింది. తమ అభిమాన నటుడిని చూసేందుకు తరలి రావడం వారి పాలిట మృత్యువైంది.
Rewind 2025 : మరికొన్ని రోజుల్లో 2025 సంవత్సరం ముగియనుంది. నూతన ఏడాది రానుంది. 2026కి వెల్ కమ్ చెప్పేందుకు అంతా రెడీ అవుతున్నారు. కాగా, 2025 సంవత్సరం కొన్ని చేదు జ్ఞాపకాలను మిగిల్చింది. అనేక కుటుంబాల్లో తీరని శోకం నింపింది. ఈ ఏడాదిలో పలు పెను విషాదాలు చోటు చేసుకున్నాయి. తొక్కిసలాటలు, పేలుళ్ల ఘటనల్లో అమాయకుల ప్రాణాలు పోయాయి.
ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకలో అపశ్రుతి..
ఈ ఏడాది ప్రారంభంలోనే పెను విషాదం చోటు చేసుకుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళాలో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 30 మంది చనిపోయారు. 60 మంది గాయపడ్డారు. ‘మౌని అమావాస్య’ కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు త్రివేణి సంగమంలో పుణ్య స్నానం చేయడానికి పోటెత్తారు. ఈ సందర్భంగా అపశ్రుతి జరిగింది. అఖాడాలకు కేటాయించిన సెక్టర్-2 ప్రాంతంలో తొక్కిసలాట చోటు చేసుకుంది.
ఢిల్లీ రైల్వే స్టేషన్ లో తొక్కిసలాట..
ఫిబ్రవరి 15న ఢిల్లీ రైల్వే స్టేషన్ లో తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో 18 మంది చనిపోయారు. 12మంది గాయపడ్డారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నారు. ఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లేందుకు భారీగా భక్తులు పోటెత్తడంతో ఈ తొక్కిసలాట జరిగినట్లు రైల్వే శాఖ అధికారులు తెలిపారు.
ప్రాణం తీసిన అభిమానం..
క్రికెట్ మీద ఉండే అభిమానం ప్రాణాలు తీసింది. అమాయకులను బలి తీసుకుంది. అనేక కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. జూన్ 4న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట జరిగింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన తర్వాత విజయోత్సవ వేడుకల కోసం చిన్నస్వామి స్టేడియంకు వచ్చిన సందర్భంలో ఈ దుర్ఘటన జరిగింది. ఈ తొక్కిసలాటలో 11 మంది మరణించారు. 47మంది గాయపడ్డారు. తమ అభిమాన క్రికెటర్లను చూసేందుకు జనం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఉచిత పాసులు, అధిక జన సమూహం, సరైన నిర్వహణ లేకపోవడం తొక్కిసలాటకు కారణాలు.
కరూర్ తొక్కిసలాట ఘటన..
అభిమానం పెను విషాదమే నింపింది. తమ అభిమాన నటుడిని చూసేందుకు తరలి రావడం వారి పాలిట మృత్యువైంది. సెప్టెంబర్ 27న తమిళనాడులోని కరూర్‌లో తమిళగ వెట్రి కళగం పార్టీ అధినేత, సినీ నటుడు విజయ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో 41 మంది మరణించారు. 50 మంది గాయపడ్డారు. అత్యంత బాధాకరమైన విషయం.. మృతుల్లో 11 మంది చిన్నారులు ఉన్నారు. విజయ్ సభకు జనం భారీగా తరలివచ్చారు. ఊహించన దానికంటే ఎక్కువ మంది వచ్చారు. అదే సమయంలో ఈ సభకు విజయ్ చాలా ఆలస్యంగా వచ్చారు.
భారీ పేలుడు.. ఉలిక్కిపడ్డ దేశ రాజధాని..
నవంబర్ 10న.. దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో భారీ పేలుడు జరిగింది. ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో జరిగిన ఈ పేలుడులో 9 మంది మరణించారు. 20 మంది గాయపడ్డారు. ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలోని ట్రాఫిక్ సిగ్నల్ వద్ద నెమ్మదిగా కదులుతున్న ఐ20 కారులో శక్తివంతమైన పేలుడు చోటు చేసుకోవడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది.
