షాహీన్‌బాగ్‌‌ను మరో జలియన్ వాలాబాగ్‌గా మార్చొచ్చు : అసదుద్దీన్

  • Publish Date - February 6, 2020 / 04:22 AM IST

ఫిబ్రవరి 8 తరువాత షాహీన్‌బాగ్‌ ను మరో జలియన్ వాలాబాగ్ మార్చొచ్చని ఎంపీ అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా 50 రోజులుగా షాహీన్‌బాగ్‌లో కొనసాగుతున్న ఆందోళనలను అణచి వేసేందుకు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేంద్రం బలప్రయోగం చేయవచ్చని అసదుద్దీన్ వ్యాఖ్యానించారు. షాహీన్‌‌బాగ్ వద్ద ఆందోళనలు చేస్తున్న నిరసనకారులను బుల్లెట్లతో కాల్చి షాహీన్‌బాగ్‌ను మరో జలియన్ వాలాబాగ్ లా మార్చొచ్చని ఎంపీ అసదుద్దీన్ వ్యాఖ్యానించారు. 

ఫిబ్రవరి 8 తరువాత షాహీన బాగ్ క్లియర్ అవుతుందని ప్రభుత్వం నుంచి సూచనలు వచ్చే అవకాశం ఉన్నట్లుగా సమాచారం ఉందని దానికి మీరేమంటారు అని ఓ మీడియా ప్రతినిథి అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ఒవైసీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఓ బీజేపీ మంత్రి మాట్లాడుతూ..సీఏఏను వ్యతిరేకించేవారిని కాల్చిపారేయాలని వ్యాఖ్యానించారని అటువంటివారిపై ‘తూటా షూట్’ ఉపయోగించాలని వ్యాఖ్యానించటం దీనికి నిదర్శనమని ఒవైసీ అన్నారు. 

కేంద్రప్రభుత్వం 2024 వరకు ఎన్సార్సీని అమలు చేయమని స్పష్టమైన సమాధానం చెప్పాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. జాతీయ జనాభా గణన కోసం కేంద్రం రూ.3,900 కోట్లు ఖర్చు చేస్తుందని, తాను చరిత్ర విద్యార్థిని కాబట్టి హిట్లర్ సమయంలో లాగా రెండు సార్లు జనాభా గణన నిర్వహించాలనుకుంటుందా అని ఆయన ప్రశ్నించారు.
కాగా..నోయిడా నుంచి  కాళింది కుంజ్ ను కలిపే మార్గాన్ని మూసివేయటంతో ఆ మార్గాన్ని తెరిపించాలని స్థానికులు ఆందోళన చేపట్టారు. ఆ మార్గాన్ని మూసివేయటంతో తమ రాకపోకలకు చాలా ఇబ్బందికలుగుతోందని కాబట్టి ఆ మార్గాన్ని తెరవాలని డిమాండ్ చేసారు.

ఈ క్రమంలో ఓ వ్యక్తి పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్ల వద్ద నిలబడి ‘‘హిందూ దేశం జిందాబాద్ ’ అని నినాదాలు చేస్తు తుపాకీతో కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై స్పందించని హైదరాబాద్ ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ మాట్లాడుతూ.. షాహీన్‌బాగ్ ను మరో జలియన్ వాలాబాగ్ గా మార్చొచ్చని వ్యాఖ్యానించారు. కాగా..షాహీన్‌బాగ్ కాల్పుల ఘటనపై బుధవారం (ఫిబ్రవరి 5,2020)న పార్లమెంట్ అట్టుడికింది.