ఎన్నికల ప్రచారంలో ఉండగా ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ పై దాడి జరిగిన సంగతి తెలిసిందే. సురేష్ అనే వ్యక్తి కేజ్రీవాల్ చెంప మీద కొట్టాడు. దీనిపై సీఎం కేజ్రీవాల్ తీవ్రంగా స్పందించారు. తనపై దాడి జరగడం ఐదేళ్లలో ఇది 9వ సారి అని చెప్పారు. దేశ చరిత్రలో ఓ ముఖ్యమంత్రిపై ఇన్నిసార్లు దాడులు జరగలేదని అన్నారు. ఓ సీఎంపై ఇన్నిసార్లు దాడి జరగడం బాధాకరం అన్నారు. తనపై దాడికి బీజేపీ కార్యాలయంలోనే ప్రణాళికలు రచించారని ఆరోపించారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా తన సెక్యూరిటీ బాధ్యత బీజేపీ చేతిలో ఉందన్న కేజ్రీవాల్, ఒక ముఖ్యమంత్రిపై దాడి జరిగితే ఎలాంటి ఫిర్యాదు రాలేదని, తదుపరి ఎలాంటి చర్యలు తీసుకోలేమని కేంద్ర ప్రభుత్వం చెప్పడం దారుణం అన్నారు. దీనికి బాధ్యత వహిస్తూ ప్రధాని మోడీ రాజీనామా చెయ్యాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. ఇది కేజ్రీవాల్‌పై దాడి కాదు..మొత్తం రాష్ట్ర ప్రజానీకంపై జరిగిన దాడిగా కేజ్రీవాల్ అభివర్ణించారు.
కేజ్రీవాల్ పై బీజేపీనే దాడి చేయించిందని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ఆరోపించారు. కేజ్రీవాల్ ను చంపేయాలనుకుంటున్నారా? అని ఆయన మండిపడ్డారు. మోతీనగర్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేజ్రీవాల్ చెంపపై సురేష్ అనే వ్యక్తి బలంగా కొట్టాడు. కేజ్రీవాల్ ఉన్న వాహనం పైకి ఎక్కిన ఆ యువకుడు దాడి చేశాడు. దాంతో కేజ్రీవాల్ పక్కకి పడిపోయారు. వెంటనే ఆ వ్యక్తిని ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు చితక్కొట్టారు.
ఈ దాడిపై పోలీసులు ఒకలా, ఆప్ నేతలు మరోలా చెబుతున్నారు. కేజ్రీవాల్ పై దాడి చేసింది స్పేర్ పార్టుల వ్యాపారం చేసుకునే సురేష్(33) అనే యువకుడని, అతడు ఆప్ మద్దతుదారుడే అని చెబుతున్నారు. ఆప్ ర్యాలీలు, మీటింగ్ ఏర్పాట్లు అతడే చూసుకుంటాడని చెప్పారు. కేజ్రీవాల్ వైఖరితో విసుగుచెంది దాడి చేసినట్టు తెలిపారు. పోలీసులు వెర్షన్ ని ఆప్ వర్గాలు ఖండించాయి. అతడు తమ పార్టీకి చెందినవాడు కాదని, బీజేపీ సపోర్టర్ అని అంటున్నారు. ఈ విషయంలో సురేష్ పై ఆప్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంతో, పోలీసులే అతడిపై సెక్షన్ 323 కింద కేసు నమోదు చేశారు.