Sonam Wangchuk : అర్ధరాత్రి హైడ్రామా.. దీక్ష విరమించిన సోనం వాంగ్‌చుక్.. త్వరలోనే షరతులను వివరిస్తానని వెల్లడి
Sonam Wangchuk : నీట్ ప్రశ్నాపత్నం లీకేజీ వ్యవహారంలో ఆందోళనలు తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రముఖ సామాజిక కార్యకర్త, విద్యా సంస్కరణల ఉద్యమకారుడు సోనం వాంగ్‌చుక్ తన 26రోజుల నిరాహార దీక్షను విరమించారు.
- Harish Thanniru
- Published on- July 24, 2026 / 07:12 AM IST
sonam wangchuk
- దీక్ష విరమించిన సోనం వాంగ్‌చుక్
- 26 రోజుల నిరాహార దీక్షకు ముగింపు..
- కేంద్ర మంత్రుల సమక్షంలో దీక్ష విరమించిన సోనం
Sonam Wangchuk : నీట్ ప్రశ్నాపత్నం లీకేజీ వ్యవహారంలో ఆందోళనలు తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రముఖ సామాజిక కార్యకర్త, విద్యా సంస్కరణల ఉద్యమకారుడు సోనం వాంగ్‌చుక్ తన 26రోజుల నిరాహార దీక్షను విరమించారు. గురువారం అర్ధరాత్రి గురుగ్రామ్ లోని మేదాంత ఆసుపత్రిలో కేంద్ర మంత్రులు జేసీ నడ్డా, జితేంద్ర సింగ్, పలువురు ఎన్డీ ఎంపీల సమక్షంలో ఆయన తన దీక్షను ముగించారు. కేంద్ర మంత్రులు ఆయనకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. ఈ నిర్ణయం సుదీర్ఘ చర్చల అనంతరం తీసుకున్నట్లు వాంగ్‌చుక్ వెల్లడించారు.
వైద్య ప్రవేశ పరీక్షల ప్రశ్నా పత్రాల లీక్ వ్యవహారం, పరీక్షల పారదర్శకతపై దేశవ్యాప్తంగా కొనసాగుతున్న విద్యార్థుల ఉద్యమానికి సంఘీభావంగా వాంగ్‌చుక్ జూన్ 28 నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, పరీక్షల వ్యవస్థలో సంస్కరణలు చేపట్టాలని ఉద్యమకారులు డిమాండ్ చేస్తున్నారు.
దీక్ష విరమిస్తున్నట్లు వాంగ్‌చుక్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. దేశంలో హింసాత్మక పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందన్న ఆందోళన, అలాగే కేంద్రంతో జరిగిన సుదీర్ఘ చర్చల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. శాంతియుత పరిష్కారానికి తాను ప్రాధాన్యత ఇస్తానని పేర్కొన్నారు.
‘కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, డాక్టర్ జితేంద్ర సింగ్, అలాగే లేహ్-లడఖ్ అపెక్స్ బాడీ సీనియర్ నాయకుల సమక్షంలో నేను 26 రోజుల నిరాహార దీక్షను ముగించాను. ఇంతకుముందు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన 65 మంది పార్లమెంట్ సభ్యులు నన్ను కలిసి, లేఖల ద్వారా దీక్ష విరమించాలని కోరారు. పలు షరతులపై సుదీర్ఘ చర్చలు జరగడం, అలాగే దేశంలో హింసాత్మక పరిస్థితులు తలెత్తే అవకాశం ఉండటాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నాను. ఈ నిర్ణయానికి సంబంధించిన అన్ని షరతులు, వివరాలను త్వరలో ప్రత్యేక వీడియో ద్వారా వెల్లడిస్తాను. అంతవరకు దేశంలో ఎక్కడా ఎలాంటి హింస చోటుచేసుకోకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను.’’ అని వాంగ్ చుగ్ పేర్కొన్నారు.
అయితే, విద్యార్థుల నిరసనలు మాత్రం కొనసాగుతున్నాయి. పరీక్షలలో అవకతవకలపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధ్యులపై చర్యలతో పాటు వ్యవస్థలో సమగ్ర మార్పులు తీసుకురావాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు.
