States Ready For Lockdown
దేశంలో కొవిడ్-19 వ్యాప్తి భయాందోళనలు సృష్టిస్తోంది. దాదాపుగా రోజుకు 20వేల కేసులు నమోదవుతున్నాయి. వైరస్ వ్యాప్తి అదుపులోకి రాకుండాపోవడం, లాక్‌డౌన్ సడలింపుల తర్వాత కూడా విచ్చలవిడిగా తిరిగేస్తున్నారు. దీంతో కరోనా వైరస్ విజృంభిస్తోంది. కిరాణా దుకాణాలు, మందుల షాపులు, మార్కెట్లు… ఇలా అన్నీ కరోనా వ్యాప్తికి కారణమవుతున్నాయి. కొందరు విందులు, వినోదాల పేరుతో సమూహాలుగా ఏర్పడుతున్నారు. వీరిలో ఒక్కరికి వైరస్ ఉన్నా కూడా ఇతరులకు సులభంగా సోకుతోంది. ఈ క్రమంలో మరోసారి లాక్‌డౌన్ విధించాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి.
దేశంలో లాక్‌డౌన్-3 వరకూ… పెద్దగా మినహాయింపులు లేవు. ప్రజలు లాక్‌డౌన్‌ను చాలా ఇబ్బందిగా ఫీలయ్యారు. లాక్‌డౌన్-4, 5లో నిబంధనల్ని చాలా వరకూ సడలించడంతో… ఇప్పుడు దాదాపు లాక్‌డౌన్ లేని పరిస్థితే కనిపిస్తోంది. అన్‌లాక్-1 ప్రారంభమైందని స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. లాక్‌డౌన్ ఉండదనే సంకేతాలిచ్చారు. లాక్ డౌన్ విషయంలో కేంద్రం రాష్ట్రాలకు అధికారాన్ని అప్పజెప్పింది. స్థానిక పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోవాలని వెల్లడించింది. దీంతో కేసులు ఎక్కువగా నమోదు అవుతున్న రాష్ట్రాలు లాక్ డౌన్ ను విధిస్తున్నాయి.
ప్రభుత్వాలు ఎక్కువ కాలం లాక్‌డౌన్ కొనసాగించే అవకాశాలు లేవు. ప్రభుత్వాలకు ఆదాయం సమకూరాలంటే ఆర్థిక కార్యకలాపాలు కొనసాగించాల్సిందే. అందుకే ఒక్కొక్క రంగాన్నీ లాక్‌డౌన్ నుంచి మినహాయిస్తూ ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. ప్రజలు మాత్రం లాక్‌డౌన్ తొలగించడంతో వైరస్ అదుపులోకి వచ్చేసిందనే భ్రమల్లో ఉన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. ఎక్కడికక్కడ గుంపులుగా తిరిగేస్తున్నారు. వైరస్ వ్యాప్తికి కారణమవుతున్నారు.
హైదరాబాద్‌లో లాక్‌డౌన్:-
దేశవ్యాప్తంగా కేసులు పెరుగుతున్నప్పటికీ ఈసారి కేంద్రం తనంతట తానుగా లాక్‌డౌన్ విధించేలా కనిపించడం లేదు. నిర్ణయాధికారం రాష్ట్రాలకే విడిచిపెట్టేసంది. దీంతో కొన్ని రాష్ట్రాలు పరిస్థితులకు తగ్గట్టుగా నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్ దిశగా అడుగులు వేయగా… మరికొన్ని రాష్ట్రాలు మరోసారి లాక్‌డౌన్ విధించాలని భావిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్‌లో మళ్లీ రెండు వారాలు లాక్‌డౌన్ విధిస్తారనే ప్రచారం జరుగుతోంది. దీనికి కారణం హైదరాబాద్‌లో కరోనా కేసులు బాగా పెరిగిపోతుండటమే. కొద్ది రోజుల్లోనే దీనిపై ఒక నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.
మహారాష్ట్రలో లాక్‌డౌన్:-
దేశంలోనే ఎక్కువ కేసులున్న మహారాష్ట్రలో లాక్‌డౌన్ కొనసాగనుంది. ఈ లాక్‌డౌన్ ఎంతకాలం కొనసాగించేదీ మహా ప్రభుత్వం చెప్పలేదు. కరోనాను నిర్లక్ష్యం చేస్తే ప్రమాదమన్న సీఎం ఉద్ధవ్ ఠాక్రే… అత్యవసర సరుకుల కోసం మాత్రమే ఇళ్లలోంచీ రావాలని ప్రజలను కోరుతున్నారు. ఒక కర్ణాటకలో ప్రతి ఆదివారం పూర్తి స్థాయి లాక్‌డౌన్ విధించాలని నిర్ణయం తీసుకుంది. జులై 5 నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుంది. ఆదివారం నాడు నిత్యవసరాలు మాత్రమే అక్కడ లభిస్తాయి. ప్రతి శనివారం ప్రభుత్వ ఆఫీసుల్ని మూసేయాలని కూడా నిర్ణయం తీసుకుంది.
తమిళనాడు లాక్‌డౌన్:-
తమిళనాడు ప్రభుత్వం కాంచీపురం, చెన్నై, చెంగల్ పేట్, తిరువళ్లూరు, మధురైలో లాక్‌డౌన్ పొడిగిస్తోంది. అక్కడ నిత్యవసరాలకు మాత్రమే ప్రజలు బయటకు రావాలని స్పష్టం చేసింది. అలాగే చెన్నై నగరంలో కూడా లాక్‌డౌన్ అమలు చేస్తోంది. పశ్చిమ బెంగాల్‌లో జులై 31 వరకూ లాక్‌డౌన్ పొడిగిస్తూ అక్కడి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు ప్రతిపక్షాలు రకరకాలుగా అభిప్రాయం చెప్పినా… సీఎం మమతా బెనర్జీ నిర్ణయమే ఫైనల్ అయ్యింది. స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్ సెంటర్లన్నీ జులై 31 వరకూ మూసివేసి ఉంచుతారు. ప్రభుత్వ కార్యాలయాలు 70 శాతం ఉద్యోగులతోనే పనిచేస్తాయి. మణిపూర్‌లో జులై 15 వరకూ లాక్‌డౌన్ విధిస్తూ ప్రభుత్వం ప్రకటన చేసింది. అంతర్ జిల్లాల బస్సుల్ని మాత్రం నడపనుంది. ఇక ఏ ప్రజా రవాణాకూ అవకాశం లేదు.
అసోంలో లాక్‌డౌన్:-
అసోంలో కేసులు పెరుగుతున్నాయి. అందువల్ల మరో 15 రోజులు లాక్‌డౌన్ విధించింది అక్కడి ప్రభుత్వం. ఆదివారం సాయంత్రం నుంచి ఇది అమల్లోకి వచ్చింది. ఫార్మసీలు, ల్యాబ్‌లు, ఆస్పత్రుల్ని మాత్రమే తెరిచి ఉంటాయి. జార్ఖండ్ కూడా జులై 31 వరకూ లాక్‌డౌన్ పొడిగించింది. పరిస్థితి అదుపులో లేదని అక్కడి ప్రభుత్వం పేర్కొంది. రాత్రి వేళ 9 గంటల నుంచి తెల్లవారు జాము 5 గంటల మధ్య కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. కాలేజీలు, థియేటర్లు, పార్కులు, ఆడిటోరియంలు, షాపింగ్ మాల్స్ మూతపడే ఉంటాయి. రాష్ట్రంలో పరిస్థితులను బట్టి లాక్‌డౌన్‌ను పొడిగిస్తామని పంజాబ్ ప్రభుత్వం తెలిపింది.
కేంద్రం లాక్‌డౌన్ ప్రకటించినప్పుడు గానీ, పొడిగించినప్పుడు గానీ రాష్ట్రాలు వద్దని కోరేవి. కానీ, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలే లాక్‌డౌన్ అమలు చేసేందుకు మొగ్గు చూపిస్తున్నాయి. ప్రజల్లో కొంత మంది కూడా కరోనాతో ఇబ్బందులు ఎక్కువవుతుండటంతో… బజార్లకు బజార్లు మూసేస్తున్నారు. వ్యాపారాల్ని కూడా త్వరగా ముగించేసుకుంటున్నారు. కొన్ని చోట్ల మార్కెట్లను స్వచ్ఛందంగా వ్యాపారులే నిలిపేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలలో కూడా మరోసారి లాక్ డౌన్ విధించడం ద్వారా వైరస్ వ్యాప్తిని నివారించ వచ్చని భావిస్తున్నారు.
వైద్య వర్గాలు ఈ విషయంపై ప్రభుత్వాలకు సలహా ఇస్తున్నారు. వీలైతే లాక్‌డౌన్ విధించడమే మంచిదని అంటున్నారు. యాక్టివ్ కేసుల సంఖ్య అధికమవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలోనే మరోసారి లాక్‌డౌన్ విధించడం ద్వారా యాక్టివ్ కేసులతో పాటు వైరస్ వ్యాప్తిని కూడా తగ్గించవచ్చని భావిస్తున్నారు.