Supreme Court : తాత ముత్తాతల ఆస్తిలో మనవడికి హక్కులేదు.. సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు..

Supreme Court : తాత నుంచి తండ్రికి వారసత్వంగా వచ్చిన ఆస్తిలో మనవడికి పుట్టుకతోనే హక్కు ఉండదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

Supreme Court

Supreme Court : తాత నుంచి తండ్రికి వారసత్వంగా వచ్చిన ఆస్తిలో మనవడికి పుట్టుకతోనే హక్కు ఉండదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తండ్రికి వారసత్వంగా వచ్చిన ప్రతి ఆస్తిలోనూ మనవడికి సమాన వాటా ఉంటుందనే వాదన సరైనది కాదని తేల్చిచెప్పింది. ఈ మేరకు మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. హిందూ వారసత్వ చట్టంలోని నిబంధనలను ప్రస్తావిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది.

Also Read : Telangana Farmers : తెలంగాణలోని రైతులకు భారీ ఊరట.. 365 మండలాల్లో రుణాల వసూళ్లకు బ్రేక్!

1956 నాటి హిందూ వారసత్వ చట్టంలోని సెక్షన్ 8 ప్రకారం.. వీలునామా రాయకుండా ఒక హిందూ పురుషుడు మరణిస్తే, ఆయన ఆస్తి క్లాస్-1 వారసులకు చెందుతుంది. ఈ జాబితాలో భార్య, కుమారుడు, కుమార్తె, తల్లి తదితరులకు స్థానం ఉంటుంది. అయితే మనవడికి నేరుగా జన్మహక్కు ఉండదని సుప్రీంకోర్టు వివరించింది. తాత మరణించిన తర్వాత సెక్షన్ 8 ప్రకారం తండ్రికి సంక్రమించిన ఆస్తి ఆయన సొంత ఆస్తిగానే పరిగణించాల్సి ఉంటుందని తెలిపింది. అలాంటి ఆస్తిలో తండ్రి జీవించి ఉండగానే తనకు వాటా కావాలని మనవడు అడగలేడని కోర్టు స్పష్టం చేసింది.

చెన్నైకి చెందిన ఈ కేసులో పిటిషనర్ తన తండ్రికి తాత నుంచి వచ్చిన భూమిలో తనకు కూడా వాటా కావాలని కోర్టును ఆశ్రయించాడు. 1994లో జరిగిన రాజీ ఒప్పందం ఆధారంగా తండ్రికి వచ్చిన భూమిలో తనకు సగం వాటా ఇవ్వాలని కోరాడు. అయితే 1997లో తండ్రి ఆ భూమిని ఇతరులకు విక్రయించాడు. దీంతో తనకు రావాల్సిన వాటా దక్కలేదని మనవడు కోర్టును ఆశ్రయించాడు.

ఈ కేసును పరిశీలించిన మద్రాస్ హైకోర్టు తండ్రికి వారసత్వంగా వచ్చిన ఆస్తిలో కొడుకుకు పుట్టుకతోనే హక్కు ఉండదని పేర్కొంది. దీంతో పిటిషనర్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. అయితే సుప్రీంకోర్టు కూడా హైకోర్టు తీర్పుతో ఏకీభవించింది. తండ్రికి వచ్చిన ఆస్తిపై మనవడికి జన్మహక్కు ఉండదని స్పష్టం చేస్తూ అప్పీలును కొట్టివేసింది.