శబరిమలలో మహిళల ప్రవేశంపై ఆలయ కంట్రోలింగ్ బోర్డు యూ టర్న్ తీసుకుంది. ఆలయంలోకి 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న మహిళల ప్రవేశంపై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.
శబరిమలలో మహిళల ప్రవేశంపై ఆలయ కంట్రోలింగ్ బోర్డు యూ టర్న్ తీసుకుంది. ఆలయంలోకి 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న మహిళల ప్రవేశంపై దాఖలైన రివ్యూ పిటిషన్లపై సోమవారం (ఫిబ్రవరి 6, 2019) సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ అంశంపై ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు యూటర్న్ తీసుకుంది. అన్ని వయసుల మహిళలు ఆలయంలోకి వెళ్లవచ్చునని బోర్డు కోర్టుకు తెలిపింది. మహిళలకు అనుమతి కల్పిస్తూ ఇచ్చిన సుప్రీం ఇచ్చిన తీర్పుపై ఎలాంటి పునః సమీక్ష చేపట్టాల్సిన అవసరం లేదని కేరళ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది.
ఐదుగురు న్యాయమూర్తులతో ఏర్పాటైన రాజ్యాంగ ధర్మాసనం ఎదుట పిటిషనర్ల తరఫున పలువురు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఈ విచారణలో ఆలయ కంట్రోలింగ్ బోర్డు సంచలన నిర్ణయాన్ని కోర్టు ముందు ఉంచింది. మహిళల ప్రవేశంపై బోర్డు ఏదైనా నిర్ణయాన్ని మార్చుకున్నదా అని జస్టిస్ ఇందూ మల్హోత్రా ప్రశ్నించారు.
అందుకు బోర్డు కౌన్సిల్ రాకేశ్ ద్వివేదీ సమాధానం ఇస్తూ.. మహిళల ప్రవేశంపై సుప్రీం తీర్పును గౌరవిస్తామని చెప్పారు. మహిళల ప్రవేశంపై తమ నిర్ణయాన్ని మార్చుకున్నామని తెలిపారు . ‘హిందూ సంప్రదాయం ప్రకారం మహిళలను ఆలయంలోకి ప్రవేశించకుండా ఆంక్షలు విధించాల్సిన అవసరం లేదు. ఓ ఆలయ సంప్రదాయాన్ని మొత్తం మతాచారంగా చెబితే చట్ట ప్రకారం చెల్లదు. శబరిమల తీర్పుపై సమీక్ష అవసరం లేదు’ అని జైదీప్ గుప్తా కోర్టుకు తెలిపారు. రివ్యూ పిటిషన్లపై తీర్పును రిజర్వ్‌లో ఉంచుతున్నట్లు కోర్టు పేర్కొంది.
మరోవైపు శబరిమల ఆలయ ప్రధాన పూజారి మాత్రం బోర్డు నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. 10-50 ఏళ్ల లోపు మహిళలకు ఆలయంలోకి ప్రవేశం కల్పిస్తూ 2018 సెప్టెంబరు 28న సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. సుప్రీం తీర్పుకు వ్యతిరేకిస్తూ కేరళ వ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ తీర్పుపై సమీక్ష జరపాలంటూ 65 వరకు రివ్యూ పిటిషన్లు దాఖలు అయ్యాయి. భక్తుల ఆందోళన కొనసాగుతుండగానే.. కనకదుర్గ, బిందు అనే ఇద్దరు మహిళలు అయ్యప్పను దర్శించుకున్న సంగతి తెలిసిందే.